AP Self Certification Scheme 2025 : భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. ఇక అధికారులు అకారణంగా కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడతారన్న భయం అంతకంటే లేదు. దరఖాస్తు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. నిర్మాణాల అనుమతులు సులభతరం చేస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్వీయ ధ్రువీకరణ పథకం ప్రత్యేకతలివి.
భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అమలుకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో గ్రౌండుతో పాటు మరో నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలకు వాటి యజమానుల స్వీయ ధ్రువీకరణతో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల నుంచి ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు.
24 గంటల్లోగా అనుమతులు : ఇందుకోసం సమీపంలోని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా దరఖాస్తులు, అనుబంధ పత్రాలతోపాటు వాటిని ధ్రువీకరిస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని ఆన్‌లైన్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అర్జీతోపాటు అనుబంధ పత్రాలను పోర్టల్ ద్వారా పరిశీలించి అనుమతులిచ్చేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. 24 గంటల్లోగా అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ వెంటనే యజమానులు భవన నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు. నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకున్నాక పనుల నిర్వహణపై పట్టణ ప్రణాళిక అధికారులు ఇప్పటివరకు చేపట్టిన పోస్ట్ వెరిఫికేషన్ పద్ధతిని ప్రభుత్వం తొలగించింది. అధికారులు కొందరు భవన నిర్మాణ యజమానులను డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆమోదిత లేఅవుట్లలోని ప్లాట్లలోనే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలి. వాటిపై యాజమాన్య హక్కులు కలిగి ఉండాలి.
AP Building Permissions : ఇందుకోసం సర్వే రిపోర్ట్, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తదితరాలు తప్పనిసరి. దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైతే అనుమతులు రద్దు చేస్తారు. టెక్నికల్ పర్సన్ల పరంగా తప్పులు చేసినట్లు నిర్ధారణైతే అలాంటి వారి లైసెన్సులు ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. చట్ట ప్రకారం తప్పు తీవ్రతను బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్తగా ప్రవేశపెట్టిన స్వీయ ధ్రువీకరణ పథకంతో ఏటా 30,000ల భవన నిర్మాణాలకు ఇక సులువుగా అనుమతులు లభించనున్నాయి. 123 పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ నిర్మాణాలకు ఏటా 35,0000లకు పైగా దరఖాస్తులొస్తున్నాయి. వీటిలో 30,000ల వరకు 18 మీటర్ల ఎత్తులోపు చేపట్టే జీ+4 భవనాలే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం ఈనెల 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలే వర్తిస్తాయి.
నిర్మాణ రంగంపై ఏపీ సర్కార్ దూకుడు- అనుమతులు ఇకపై మరింత సులభం
"అమరావతి రాజధాని"లో ఆ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటు - ఫిక్స్ చేసిన CRDA