కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించింది. ప్రధానంగా విజయవాడతో పాటు పొరుగున ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. గత ఫిబ్రవరిలో శంకుస్థాపనల ముహూర్తాలు ఉన్న కారణంగా.. పెద్దసంఖ్యలో నిర్మాణాలు మొదలుపెట్టారు. ఉపాధి హామీ, 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంటు రహదార్లు, డ్రెయిన్ల నిర్మాణాలను భారీ స్థాయిలో ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా జిల్లాలోని ఇసుక క్వారీలు మూతపడి సరఫరా అధికారికంగా నిలిచిపోయింది. నల్లబజారులో అధిక ధరకు దొరుకుతున్నా యజమానులు భరించలేక వెనుకంజ వేస్తున్నారు.
గతంలో మెట్రిక్ టన్ను రూ.375 క్వారీ వద్ద ఉంటే దీనికి అదనంగా అంతే మొత్తం రవాణా ఛార్జీల కింద వసూలు చేశారు. ఉదాహరణకు రొయ్యూరు క్వారీ వద్ద 18 మెట్రిక్ టన్నుల లారీ ఇసుక రూ.6750, అదనంగా రవాణా ఛార్జీల కింద 42 కిమీల దూరంలో ఉన్న మచిలీపట్నానికి రూ.6043 అయితే మొత్తం రూ.12,793 గత ఫిబ్రవరిలో వసూలుచేశారు.
ప్రస్తుతం అనధికారికంగా అర్ధరాత్రి సమయంలో క్వారీల నుంచి టిప్పర్ల ద్వారా వస్తున్న ఇసుకను మెట్రిక్ టన్నుకు రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా 3 మెట్రిక్ టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక ధర రూ.8 వేల వరకు పలుకుతోంది. లారీలతో ఇసుకను సరఫరా చేయడం నిలిపివేసి ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మచిలీపట్నం, బంటుమిల్లి, గుడివాడ ప్రాంతాల్లో బ్లాక్‌మార్కెట్‌లో ఇసుక పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంది.
పెరిగిన సిమెంటు ధర
ఇటీవల సిమెంటు, ఇనుము ధరలూ భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.280 ఉన్న ఓపీసీ సిమెంటు 50 కిలోల బస్తా ప్రస్తుతం రూ.400కు చేరుకుంది. ఇనుము టన్ను రూ.52 వేల నుంచి రూ.65 వేల వరకు పలుకుతోంది. దీంతో ప్రభుత్వ పనులతో పాటు ప్రయివేటు రంగంలోని భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు నిలిచి నిర్మాణ రంగంలోని తాపీ, వడ్రంగి, రాడ్ బెండింగ్, ఎలక్ట్రికల్, మార్బుల్, ఫౌండ్రీ, పెయింటింగ్ తదితర వృత్తుల కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
30 ఏళ్లుగా తాపీ మేస్త్రీగా వందల భవనాలను నిర్మించినా ఇంతటి సంక్షోభాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని పెడనకు చెందిన జన్ను ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక క్వారీలు తెరిస్తే తప్ప ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: