కొవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని... ఈ దిశగా అదనంగా వైద్యపరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని నియమిస్తామని... కృష్ణా జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొవిడ్ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులతో ప్రస్తుత పరిస్థితిని ఆయన సమీక్షించారు.
జీజీ హెచ్ ఆసుపత్రిలో 790 పడకలు ఉన్నాయన్నారు. ఆసుపత్రి సామర్ధ్యానికి అనుగుణంగా పాజిటివ్ పేషెంట్లను చేర్చుకొని వైద్య సహాయం అందించాలన్నారు. ఆయా ఆసుపత్రుల్లో అవసరం మేరకు ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఇంకా అవసరమైతే ఆక్సిజన్ కెపాసిటీని పెంచుకోవాలని సూచించారు. అవసరమైన మేరకు వెంటి లేటర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా కొవిడ్ సేవలు అందిస్తున్నామన్నారు.
కోవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు డాక్టర్లు , వైద్య సిబ్బందికి భోజనం , ప్రత్యేక వసతి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రుల్లో అవసరం మేరకు వైద్యపరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: