CM launched Jagananna Suraksha programme: సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని జల్లెడ పట్టి గుర్తించేందుకే జగనన్న సురక్ష పేరిట కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ.. జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు.
పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం... రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలి పోకూడదన్న తపన, తాపత్రయంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పేదలకు, పేద లబ్ధిదారులకు ప్రభుత్వమే ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని సీఎం జగన్ పేర్కొన్నారు.
సర్వీసు చార్జీలు లేకుండా 11 రకాల సేవలు ఉచితం... జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులకు పథకాలు మంజూరు చేస్తారని, వివిధ రకాల సర్టిఫికెట్లు జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీ చేస్తారని తెలిపారు. ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్ కు బ్యాంక్ లింకేజీ, ఆధార్ కార్డుల్లో మార్పులు ఇవన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారన్నారు. ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఉండీ ఏ సాంకేతిక సమస్యల వల్లనైనా పథకం వర్తించకపోతే దాన్ని సరిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇలా దాదాపుగా 11 రకాల సేవలు ఎలాంటి సర్వీసు ఛార్జీలు కూడా లేకుండా జగనన్న సురక్ష ద్వారా ఉచితంగా ప్రజలందరికీ అందించే అడుగు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం పరిశీలన, పర్యవేక్షణ కోసం 26 జిల్లాలో ఐఏఎస్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
సీఎంను కలిసిన యూపీఎస్ సీ 2022 ర్యాంకర్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏపీకి చెందిన 17 మంది యూపీఎస్‌సీ - 2022 ర్యాంకర్లు కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ర్యాంకర్లను సీఎం అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు.