తెలంగాణలో ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ అనంతరం లాక్డౌన్పై పలు నిర్ణయాలు ప్రకటించారు.
రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ప్రాంతాలు తప్ప మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని ముఖ్యమంత్రి ప్రకటించారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ ఏరియాల్లో ఉంటాయి. పూర్తిగా పోలీసు పహరాలోనే ఈ ప్రాంతాలు ఉంటాయి. ఈ పరిధిలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. రాజధాని పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో నిర్ణయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరిచేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రేపటినుంచి తెలంగాణలో బస్సులు ప్రారంభం
తెలంగాణలో రేపటినుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవని తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతిచ్చారు. అయితే నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైలు సర్వీసులు కూడా పని చేయవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని వెల్లడించారు.
ఇదీచూడండి. 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'