మచిలీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నుంచి మచిలీపట్నం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మంత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లనున్నారు. మంత్రి పేర్ని నాని తల్లి ఇటీవలే మరణించారు. తల్లిని కోల్పోయిన పేర్ని నానిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అనంతరం మత్స్యశాఖ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా 4 ఫిషింగ్ హార్బర్లకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.1,510 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్లకు రూ.3 వేల కోట్ల ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ముమ్మర చర్యలు చేపట్టామని పేర్కొంది.
నియోజకవర్గానికో ఆక్వా హబ్ నిర్మాణ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.225 కోట్లతో మొదట 25 ఆక్వా హబ్‌లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి : అనంతపురంలో చిరుతల సంచారం...మూడు మేకలు మృతి