ఏడాది కాలంగా విజయవాడ నగరం నడిబొడ్డున కేవలం ఫార్మసీకి అనుమతి తీసుకుని, ఏకంగా మూడంతస్తుల భవనంలో 50 పడకలతో ఆసుపత్రి నిర్వహిస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. విజిటింగ్ వైద్యులతో రోగులకు చికిత్సలు అందించారంటే పరిస్థితి అంచనా వేయవచ్ఛు ఇదీ వేదాంత ఆసుపత్రి ఉదంతం.
ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సకు అనుమతి ఉంది. అక్కడ ఉన్న పడకలను సగం ప్రభుత్వానికి కేటాయించి, నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలి. కానీ అక్కడ రోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరుడికే ఈ అనుభవం రావడంతో ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ స్పందించి, అధికారులతో తనిఖీలు చేయించారు. యాజమాన్యం దస్త్రాలు చూపకపోవడంతో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
కృష్ణా జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై విజిలెన్సు అమలు విభాగం నిఘా పెంచింది. అధిక రుసుములు వసూలు చేసే వాటిపై వేటు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలో నాలుగు ప్రముఖ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు. వేదాంత ఆసుపత్రిని పూర్తిగా మూసివేశారు. సన్‌రైజ్ ఆసుపత్రికి రూ.15లక్షల వరకు జరిమానా విధించారు. మిగిలిన వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు.
మరో ఆసుపత్రిపై ఫిర్యాదు..!
నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఓ మహిళ ఆరోపణ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. సురేష్ అనే పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గత నెల 24న ఇక్కడ చేర్చారు. రోగి పరిస్థితి క్లిష్టంగా మారిన తర్వాత కనీసం ఆక్సిజన్ లేకుండా డిశ్ఛార్జి చేశారు. రూ.7,02,350 బిల్లు వేశారు. కానీ రశీదులు ఇవ్వలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆసుపత్రిపై వారు విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.
ముందుగా చెల్లిస్తేనే చికిత్స
జిల్లాలో మొత్తం 77 ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నవి ఆరు వరకు ఉన్నాయి. ఆసుపత్రులతో పాటు కొన్ని నక్షత్ర హోటళ్లను కొవిడ్ కేర్ సెంటర్‌లుగా మార్చి చికిత్స చేస్తున్నారు. నగరంలో రెండు హోటళ్లు ఈ విధంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ చికిత్సకు రుసుములు ఖరారు చేసింది. కానీ ఈ ధరలను అమలు చేస్తున్న ఆసుపత్రులు వేళ్లమీద లెక్కపెట్టొచ్ఛు ప్రధానంగా విజయవాడలోనే కొన్ని చోట్ల దందా కొనసాగుతోంది. భారీగా రుసుములు వసూలు చేస్తున్నారు. ముందే రూ.లక్ష కట్టించుకుంటున్నారు. మరో రూ.4లక్షలు బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సి ఉంది. ఈ విధానంతోనే పలువురు బెంబేలెత్తుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. దానికింద చికిత్స అందించడం లేదు.
అంతా నగదు లావాదేవీలే..!
కార్పొరేట్ ఆసుపత్రుల్లో కేవలం నగదు లావాదేవీలనే అమలు చేస్తున్నారు. ఎవరైనా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు స్వైప్ చేయమంటే.. అదనంగా 2శాతం వసూలు చేయాల్సి ఉంటుందని, ఎందుకు అనవసర ఛార్జీలు పక్కనే ఎటీఎం ఉంది.. నగదు తీసుకురండి.. అని ఉచిత సలహా ఇస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు బిల్లులు కూడా ఇవ్వడం లేదని విజిలెన్సు దృష్టికి వచ్చింది. వీటన్నింటిపై దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే తనిఖీలు చేస్తున్నామన్నారు.
నిమ్రా యాజమాన్యం మార్ఫు?
ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రి యాజమాన్యాన్ని మార్చాలని నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతలు స్వయంగా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఆసుపత్రి మొదట హైదరాబాద్‌కు చెందిన రసూల్ అనే వ్యక్తి నిర్వహణలో ఉండేది. రెండో దశ కోవిడ్ ప్రారంభం అయిన తర్వాత ధర్మతేజ అనే వ్యక్తి తీసుకున్నారు. ఇక్కడ మొత్తం 400 పడకలు ఉన్నాయి. వీటిలో సగం ప్రభుత్వానికి కేటాయించారు. మిగిలిన సగం ఆసుపత్రి నిబంధనల ప్రకారం నిర్వహించాలి. దీనికి సమన్వయ కర్తగా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులను నియమించారు. ఆయన ఆసుపత్రి దగ్గర ఉండకుండా తన సహాయకుడికి అప్పగించినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఫిర్యాదులు వచ్చిన తర్వాత జేసీ మాధవీలత, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర తనిఖీ నిర్వహించారు. తిరిగి శనివారం కలెక్టర్ మంత్రుల బృందం పరిశీలించింది. పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో దీనిపై జరిగిన సమీక్షలో తానే స్వయంగా నిర్వహణ బాధ్యతలు తీసుకుంటానని ఎమ్మెల్యే ముందుకు వచ్చారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇదీ చదవండి: