CM's review of sports management: "ఆడుదాం ఆంధ్ర" పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా జరిపించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడలపై సీఎస్ జవహర్‌రెడ్డి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయడంతోపాటు, స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలని సీఎం సూచించారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు రుచికరమైన భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేయాలి.. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం దిశగా అడుగులు వేయాలన్నారు. ఇది సాకారమయ్యాక ప్రస్తుతం ఉన్న వైయస్సార్ స్టేడియాన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగులు వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు.
2500మందికి ఉద్యోగ అవకాశాలు.. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. పలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు పరిశ్రమల పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించారు. వీటితో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటయ్యాయని సీఎం తెలిపారు.
ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ప్రభుత్వం.. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ తయారీ పరిశ్రమ క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడే ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని పెడుతున్న విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ కర్మాగార పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్ కాఫీ లిమిటెడ్ ఫుడ్, బేవరేజెస్ కంపెనీకి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మూడు ప్లాంట్లకు శంకుస్థాపనతో పాటు మరో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి అధికారికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటుందని, ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.