వారాంతం వచ్చిందంటే చాలు కోడి కూర తిందామంటూ ఎదురుచూసే వారెందరో. కరోనా కట్టడిలో భాగంగా ఆదివారాలు చికెన్ దుకాణాలు తెరవకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించినందున.. శనివారం రోజే కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవడం రాష్ట్ర వాసులకు కొద్దివారాల నుంచి అలవాటుగా మారింది. అయితే అమాంతం పెరిగిన చికెన్ ధరలు మాంసాహార ప్రియుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కేజీ చికెన్ ధర రూ. 310లకు చేరింది.
తగ్గిన కోళ్ల పెంపకం
రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. బ్రాయిలర్ రైతులు కొత్తగా బ్యాచులు వేయకుండా ఆగిపోతున్నారు. లేయర్ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపని కారణంగా.. కోడి పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా... రాష్ట్రంలో కోళ్ల పెంపకం గణనీయంగా పడిపోయింది. కోడిపిల్లల ఉత్పత్తిని నిలిపివేసి గుడ్లను నామమాత్రపు ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్ల పునరుత్పత్తిని నిలిపివేయడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రంలో కోళ్ల పెంపకం గణనీయంగా పడిపోయింది. ఇందుకు తోడు ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు తూగుతున్నాయి.
నష్టం చేసిన వదంతులు
చికెన్ తింటే కరోనా సోకుతుందంటూ పాకిన వదంతులు... కోళ్ల పరిశ్రమను తీవ్రంగా కుంగదీశాయి. ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. కేజీ చికెన్ 30 రూపాయలకు మాత్రమే అమ్మిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నష్టాన్ని భరించలేక, కోళ్ల పునరుత్పత్తిపై ఖర్చు పెట్టలేక, ఆహారం, ధాన్యం కొరత.. వీటన్నింటి కారణంగా పిల్లల ఉత్పత్తిని చాలావరకూ పౌల్ట్రీ నిర్వాహకులు నిలిపివేసి గుడ్లను విడిగా అమ్ముకోవడం ప్రారంభించారు.
పౌల్ట్రీ రంగం దెబ్బతినగా... ఆ ప్రభావం కోళ్లమేతకు ఉపయోగించే మొక్కజొన్న, జొన్న తవుడు, నూకలపై పడుతోంది. గతంలో కొందరు కోళ్ల రైతులు మొక్కజొన్న, జొన్న తదితర దాణా తయారీ సరకులను కొనుగోలు చేసి గరిష్ఠంగా 2 నెలల పాటు నిల్వ చేసుకునేవారు. అయితే ఈ ఏడాది ఈపరిస్థితి కనిపించడం లేదు. నష్టాల కారణంగా చాలామంది పెంపకందారులు బ్యాంకులకు పెద్దఎత్తున బకాయి పడుతున్నారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించలేక సతమతమవుతున్నారు.
చికెన్‌కు, కరోనాకు ఎలాంటి సంబంధం లేదంటూ వాదనలు బలపడుతుండగా.. మాంసం ప్రియులు తిరిగి చికెన్‌పై ఆసక్తి కనబరచడం ప్రారంభించారు. అయితే.. లాక్‌డౌన్ కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు తెరవకపోవటంతో నష్టాల నుంచి కోలుకుని పౌల్ట్రీ నిర్వాహకులు కోడిపిల్లల పెంపకాన్ని ప్రారంభించలేదు. ఈ కారణంగా.. రాష్ట్రంలో కోళ్ల లభ్యత తగ్గి చికెన్‌కు డిమాండ్ పెరిగినందున ధరలు అమాంతం అధికమయ్యాయి.
ప్రభుత్వ తోడ్పాటు అవసరం
బర్డ్ ప్ల్యూ, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు నష్టం వాటిల్లినా... ఇంత దారుణంగా ఎప్పుడూ లేదని వ్యాపారులు వాపోతున్నారు. గ్రామీణ, రైత్వారీ రంగాల కలయికతో నడుస్తున్న కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డుకాలం నుంచి ఊపిరి తీసుకోవడానికి ప్రభుత్వ తోడ్పాటు ఎంతైనా అవసరమని వేడుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మార్కెట్‌లో మళ్లీ చికెన్, గుడ్లు అందుబాటులోకి రావడానికి 6 నెలల సమయం పట్టవచ్చని కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: