అమరావతి ఉద్యమానికి ఈనెల 12న 300 రోజులు పూర్తవుతున్న వేళ.. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు అన్ని మండలాల్లో సంఘీభావ దీక్షలు, ర్యాలీలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...రేపు అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు, అనంతరం... రాత్రికి స్కై లాంతర్ల ద్వారా నిరసనలు తెలపాలని సూచించారు. సోమవారం అన్ని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సంఘీభావ దీక్షలు, ప్రదర్శనలు చేయాలన్నారు. 3 వందల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు, రైతు కూలీల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరిని చంద్రబాబు ఖండించారు. భూములు, ఉపాధి కోల్పోయి దయనీయంగా మారిన అమరావతి రైతులకు రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలవాలని కోరారు. ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసి ఈ విజయ దశమికి 5ఏళ్లు అవుతుందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం, 13జిల్లాల అభివృద్ది ఒక యజ్ఞంగా భావిస్తూ విభజన నష్టాల భర్తీకి కృషి చేస్తే... ఆ స్ఫూర్తిని వైకాపా సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
నేలతల్లి క్షమించదు
రైతుకు ద్రోహం చేస్తే నేలతల్లి క్షమించదని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారం కోసం అమరావతిపై ప్రజల్లో అపోహలు సృష్టించారని ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతమని, పునాదులు బలహీనమని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అసత్యాలు ప్రచారం చేసి ఏ ఒక్కటీ రుజువు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఎక్కువగా ఉంది ఎస్సీ సామాజిక వర్గం అయితే... కులం పేరుతో తప్పుడు ప్రచారం చేసి వారికీ ద్రోహం చేశారన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల సంపద నాశనం చేయటం సహా 10వేల కోట్లతో నిర్మించిన భవనాలను నిరుపయోగం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అమరావతి ద్వారా సమకూరే దాదాపు 40శాతం ఆదాయాన్ని పోగొట్టారన్నారు. ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్రకు కూడా వైకాపా చేసిందేమీ లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖకు ఏం చేశారని అక్కడి ప్రజలే నిలదీయాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
భూ కుంభకోణాలకు వైకాపా చిరునామా
రాయలసీమకు 18 నెలలుగా నీటిపారుదల ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారని ఆక్షేపించారు. వచ్చిన కంపెనీలను వాటాల కోసం బెదిరించి తరిమేశారన్న చంద్రబాబు.... తెదేపా ప్రభుత్వం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వాటికే మళ్లీ చేయడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఎస్సీలు, ఆలయాలపై దాడులకు కేంద్రంగా ఏపీని మార్చారన్నారు.భూ కుంభకోణాలకు చిరునామాగా వైకాపా మారిందని ఆరోపించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం గతంలో లేదన్నారు. సాక్ష్యాధారాలతో సహా మంత్రి జయరామ్ పట్టుబడినా ఇంతవరకు చర్యలు లేవని తప్పుబట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను జైలుకు పంపారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామాగా తెదేపా నిలిపితే, వైకాపా అరాచకంగా మార్చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదీచదవండి