chandrababu fires on cm jagan : రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే, ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారని గుర్తుచేశారు. నేడు బాధ్యత లేని విధ్వంసకారుడు ముఖ్యమంత్రి గా ఉండటం వల్ల భావితరాల భవిష్యత్తు కూడా నేడు గోదావరి పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ 27వ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవానికి ఆత్మ విశ్వాసం జోడించి ముందుకెళ్తే, ప్రపంచాన్ని జయించే శక్తి మన సొంతం అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు పై నమ్మకం పోయిన తాజా పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
రాజకీయాల ద్వారా దేశానికి దశ దిశ నిర్ధేశించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని మండిపడ్డారు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు సీఎం జగన్ అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. పేదల రక్తాన్ని కూడా జలగలా తాగేస్తున్నాడని విమర్శించారు.
5కోట్ల ప్రజలు పోరాడాల్సిన తరుణమిదని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాది జరుపుకోనుండటం ఓ అరుదైన అనుభవమన్నారు. సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన ఎన్టీఆర్ సిద్దాంతం మరెవరికీ లేదని తేల్చిచెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే కందుకూరు, గుంటూరులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు అన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులే కొన్ని కానుకలు విసిరేసి జనం ఎగబడేలా చేసిన వీడియోలు తమ దృష్టికి వచ్చాయన్నారు.
వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే.. ఎన్టీఆర్‌కి ఇచ్చే ఘనమైన నివాళి అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :