స్వచ్ఛసర్వేక్షణ్‌లో గతంలో ముందున్న విజయవాడ నగరం.. నివాసయోగ్యత విషయంలో వెనుకబడింది. దేశంలో పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో 41వ స్థానంతో నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించాయి. గతేడాది దేశవ్యాప్తంగా పోటీలో నిలిచిన 111 నగరాల్లోని వసతులుపై.. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ర్యాంకులను లెక్కగట్టింది.10 లక్షల పైన జనాభా ఉన్న నగరాల విభాగంలో 49 నగరాలు పోటీ పడగా.. బెజవాడ 41వ స్థానంలో చోటుదక్కించుకుంది.
ఆర్థిక సామర్థ్యం, పౌరుల అభిప్రాయం, జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి.. వంటి నాలుగు అంశాల ఆధారంగా ఈ నగరాలను లెక్కించారు. ఇందులో.. పౌరుల స్పందనలో అత్యధికంగా 67.40 మార్కులు వచ్చాయి. ఆర్థిక సామర్థ్యంలో కేవలం 11.57, జీవన ప్రమాణాల్లో 50.40, సుస్థిర అభివృద్ధిలో 53.78 చొప్పున సగటున 50.35 మార్కులు విజయవాడకు దక్కాయి.
నగరపాలక పనితీరు సూచిలో వెనుకబడ్డా.. 27వ ర్యాంకు సాధించింది. ఈ విభాగంలో నివాసయోగ్య సూచి మెరుగుకు ఉపయోగపడే వాటిపై దృష్టి పెట్టి లెక్కించారు. ప్రజలకు సేవలు అందించే విధానం, ప్రణాళిక, ఆర్థిక, పాలనా వ్యవస్థల్లో నగరపాలిక విధానాల ఆధారంగా గణించారు. ఇందులో విద్య, వైద్యం, నీరు, పారిశుద్ధ్యం, రిజిస్ట్రేషన్, మౌలిక వసతులు, ఆదాయ వనరులు, వ్యయాలు, ఆర్థిక క్రమశిక్షణ, వికేంద్రీకరణ, డిజిటల్ పాలన, డిజిటల్ అక్షరాస్యత, ప్రణాళిక తయారీ, దాని అమలు, మానవ వనరులు, వంటి 20 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అన్ని కలిపి సగటున 46.04 మార్కులు నగరానికి పడ్డాయి.
సాంకేతికత వినియోగం విషయంలో వీఎంసీ వెనుకబడింది. ఈ విభాగంలో నగరం మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది.
ఇవీ చూడండి...: స్టాంపు డ్యూటీ పెంపు యోచనలో రాష్ట్ర ప్రభుత్వం !