విశాఖ రాజధాని అంటే అక్కడి ప్రజలు భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని విజయవాడలో 'మీట్ ది మీడియా'లో అన్నారు. విశాఖలోనే కాదు.. విజయనగరంలో కూడా ప్రజలు భయపడుతున్నారన్నారు. చేపలుప్పాడలో తన భూమిని కూడా వైకాపా మాఫియా కబ్జా చేసిందని తెలిపారు. తన స్థలం చుట్టూ కంచె వేశారని...తీరా అది తనదని తెలిశాక వెనక్కి తగ్గారని వివరించారు.
ప్రజలకు పనికొచ్చే పని జగన్ ప్రభుత్వం చేయలేదు...
ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం కొంతమంది పొట్ట కొడుతోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వం... ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదన్నారు. ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ప్రతిపక్షనేతలు నామినేషన్ వేయలేని పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను వైకాపా పక్కన పెట్టిందన్నారు.
కరోనాపై వస్తున్న వార్తల్లో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కన్నా పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీడియా పాత్ర కీలకమని కన్నా సూచించారు.
ఇవీ చదవండి: మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!