బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేక చికిత్స అందించాలని సీఎం జగన్కు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో చెవి, ముక్కు, గొంతు విభాగాల్లో వైద్యం అందించేలా సీఎం జగన్ చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. దేశం కొవిడ్-19ను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో కరోనా రోగుల్లో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడి సతమతమవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన రోగులు రాష్ట్రంలో చికిత్స తీసుకుంటున్నారని.. కానీ చాలా చోట్ల సంబంధిత మందుల కొరత ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వాస్పత్రికి వెళ్తున్నారని తెలిపారు. కోఠి ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేసిందన్నారు.
వెనక్కి పంపుతున్నారు..
కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది రాష్ట్రానికి చెందిన రోగులకు చికిత్స చేయకుండా వెనక్కి పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే తప్ప ఏపీ రోగులకు వైద్యం చేయలేమని అక్కడి సిబ్బంది చెబుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పేద రోగులకు తెలంగాణలోనూ చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు.
వెంటనే కేసీఆర్‌తో మాట్లాడండి..
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వెంటనే మాట్లాడి బ్లాక్ ఫంగస్ బారిన పడిన రాష్ట్రంలోని రోగులకు కోఠి ఆస్పత్రిలో వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేయించాలని సీఎం జగన్‌ను విజ్ఞప్తి చేశారు. లేఖకు స్పందించి సమస్యకు పరిష్కారం చూపిస్తారని రాష్ట్ర ప్రజల తరపున ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి : సీఎం