కరోనా మహమ్మారి ఆరోగ్యంపై శ్రద్ధను పెంచడంతో పాటు ఆర్థిక శ్రద్ధ ఆవశ్యకతనూ తేటతెల్లం చేస్తోంది. వైరస్ వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరకులు, కూరగాయలు, శానిటేషన్ వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో సంపాదనలోనూ తగ్గుదల వచ్చింది. ప్రజలు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బతుకు భారమై ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా మారిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్న సగటు కుటుంబానికి నిత్యావసరాలతో పాటు విద్యుత్తు బిల్లుల చెల్లింపు భారంగా మారింది. విద్యుత్తు వినియోగంలో పొదుపు మంత్రం పాటించక తప్పని పరిస్థితి వచ్చింది. పొదుపుగా వాడుకుంటే బిల్లులో కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశముంది. కొందరు దాన్ని ఇప్పటికే అమల్లో పెట్టారు. ఒక్కో కుటుంబం నెలకు రూ. 500 నుంచి రూ.వేయి వరకు ఆదా చేసుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలో 63,54,929 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 35 లక్షలకు పైగా కేవలం గృహావసరాలకు సంబంధించినవే. చాలామంది ఆరు నెలలుగా విద్యుత్తు బిల్లులను ఎంతో కొంత తగ్గించుకుంటున్నారు. కరోనా వైరస్ శీతల ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉంటుందని, త్వరగా వ్యాపిస్తుందన్న విషయాన్ని తెలుసుకొని ఏసీల వినియోగాన్ని చాలావరకు తగ్గించారు. వేడిగా ఉండే ఆహార పదార్థాలతో పాటు వేడి నీళ్లను మాత్రమే తాగడం వల్ల ఫ్రిజ్‌ల వినియోగం బాగా తగ్గింది. నెలవారీ సగటు బిల్లులో సగం కంటే తక్కువ బిల్లును పొందుతున్నారు.
ప్రణాళికతో వినియోగం
విద్యుత్తు పంపిణీ సంస్థ వినియోగదారులను మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూప్-ఎలో 75 యూనిట్ల లోపు, గ్రూప్- బిలో 75 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు, గ్రూప్-సిలో 225 యూనిట్లు దాటినవారికి వాటికి నిర్ణయించిన మేరకు బిల్లులు విడుదలవుతాయి. మొదటి గ్రూపులో సగటున 75 యూనిట్లలోపు వాడే వారికి అత్యధికంగా యూనిట్‌కు రూ.2.60, గ్రూప్-బీలో 200 యూనిట్లలోపు రూ.3.60 వసూలు చేస్తోంది. ఈ గరిష్ఠ పరిమితికి ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం యూనిట్లను తర్వాత గ్రూపు ప్రకారం బిల్లు చెల్లించాలి. గ్రూపు-సిలో కనిష్ఠంగా 50 యూనిట్లలోపు రూ.2.65 వసూలు చేస్తుండగా.. 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.9.95 బిల్లు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కేటగిరీల్లో ఇచ్చిన యూనిట్ల కంటే తక్కువగా వినియోగించుకునేలా ప్రణాళిక చేసుకోవాలి.
వీటిని పాటిస్తే మరింత మేలు
- అవసరాన్ని బట్టి ఎక్కువ కాంతిని ఇచ్చే బల్బులను వాడాలి. అవసరం లేనపుడు ఆపివేయాలి.
- ఫ్రిజ్ తలుపులను పదే పదే తెరవడంవల్ల తెలియకుండానే బిల్లు పెరిగిపోతుంది.వేడిగా ఉన్న పదార్థాలు చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి.
- మధ్యాహ్న వేళల్లో ఇంట్లో వేడిగా ఉంటే తలుపులు, కిటికీల కర్టెన్లు పక్కకు తొలగించడం వల్ల గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తుంది. బల్బులు, పంకాలు వేయాల్సిన అవసరముండదు.
- సాధారణ బల్బుల స్థానంలో సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బులను వినియోగించడం వల్ల 80శాతం విద్యుత్తును ఆదా చేసుకోవచ్ఛు
- ఏసీలను 24-26 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్దే ఉండేలా చూడడం వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
ఫ్రిజ్ వాడకం మానేశాం
కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఇంటికే పరిమితమయ్యాం. గృహ విద్యుత్తు వాడకం అధికమైంది. ఎప్పటికప్పుడే కూరగాయలు, పండ్లు తీసుకురావడంతో ఫ్రిజ్‌ను వాడటం తాత్కాలికంగా ఆపివేశాం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, కూలర్ వాడకాలను తగ్గించి విద్యుత్తును పొదుపు చేసుకుంటున్నాం.. గతంలో రూ.వెయ్యి వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.500 లోపు వస్తోంది. - ఎన్.విజయకృష్ణ, సీతనపల్లి
పొదుపుగా వాడుతున్నాం
మా ఇంటిలో రెండు ఏసీలు నిరంతరం పనిచేస్తూ ఉండేవి. ఆర్నెళ్లుగా ఉపాధి లేకపోవడంతో విద్యుత్తు బిల్లు భారంగా మారింది. ప్రస్తుతం ఏసీల వాడకం పూర్తిగా ఆపివేశాం. ఎల్‌ఈడీ లైట్లు వినియోగంతో కరెంటును 40 శాతం వరకు ఆదా చేస్తున్నాం. మార్చిలో రూ.2200 బిల్లు రాగా ప్రస్తుతం రూ.1180 మాత్రమే వచ్చేలా నియంత్రించగలిగాం. - నంగెడ్డ పవన్‌కృష్ణ, కైకలూరు
వినియోగాన్ని నియంత్రించుకోవచ్చు
విద్యుత్తు పొదుపు తప్పనిసరి. అవసరం లేనప్పుడు ప్రతి స్విచ్ ఆపివేయడం ఉత్తమం, యూనిట్ విద్యుత్తు ఆదా చేస్తే 2 యూనిట్లు పునరుత్పత్తి సాధ్యపడుతోంది. గృహావసరాలకు యూనిట్ రూ.1.45తో మొదలవుతుంది. కరెంట్ అధికంగా వినియోగిస్తే గ్రూపు-సి లోకి వెళ్లి యూనిట్‌కి రూ.9.95 ఛార్జీ పడుతుంది. ఆదాతోనే బిల్లులను తగ్గించుకునే వీలుంటుంది. - ఒ.బసవరాజు, డీఈఈ, విద్యుత్తు శాఖ