సంగీత రంగంలో మహిళలు ఎక్కువగా సులభంగా ఉండే వయోలీన్, వేణువు వంటి వాయిద్యాలను ఎంచుకుంటుంటారు. విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన లక్ష్మీ శ్రీవిద్య మాత్రం కష్టమైన మృదంగాన్ని ఎంచుకుని రాణిస్తోంది. నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సులో మూడేళ్లు పూర్తి చేసుకున్న విద్య... ప్రస్తుతం బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత, సంగీత, నృత్య కళాశాల మృదంగ అధ్యాపకులు పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ వద్ద శిక్షణ తీసుకుంటోంది. భారతదేశంలో మృదంగ విభాగంలో ప్రప్రథమ మహిళా శిరోమణిగా పేరుపొందిన విజయవాడకు చెందిన దండమూడి సుమతీరామ్మోహన్ స్ఫూర్తిగా మృదంగ విద్యలో రాణిస్తోంది.
ప్రదర్శనలు... పురస్కారాలు
లక్ష్మీ ప్రసన్న... ఓ పక్క మృదంగంలో మెళకువలు నేర్చుకుంటూనే... వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. 2017లో మృదంగలయ విన్యాసం, లయనాద కళా స్రవంతి సంస్థ వార్షిక మహోత్సవాల్లో పాల్గొంది. ఉత్తర ప్రదేశ్ లోని రామకృష్ణ మిషన్ బృందావనంలో నిర్వహించిన మృదంగ విన్యాస ప్రదర్శనలోనూ పాల్గొని ప్రశంసలతో పాటు పురస్కారం అందుకుంది. మృదంగ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ సమకాలీకుడైన అన్నవరపు రామస్వామి చేతుల మీదుగా ఉత్తమ యోగ్యతా పత్రం అందుకుంది. ఆసక్తి ఉండాలనే కానీ ఏ రంగంలోనైనా మహిళలు రాణించవచ్చు అనడానికి ఓ ఉదాహరణలా మారింది లక్ష్మీ శ్రీవిద్య.