కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రతిపాదిత బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేస్తూ ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పేరిట కేంద్రానికి లేఖ పంపింది. ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌ను కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆక్షేపించింది. బిల్లు చట్టంగా మారితే రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని లేఖలో పేర్కొంది. విద్యుత్ సవరణ బిల్లు ప్రైవేటు ఉత్పత్తిదారులకు అవసరాన్ని మించిన రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది. తద్వారా కరెంటు కొనుగోలు ధర పెరిగి వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని వివరించింది. విద్యుత్ కొనుగోలు ఖర్చు పెరిగితే పారిశ్రామిక వినియోగదారులకూ నష్టం కలుగుతుందని తద్వారా పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలుగుతుందని వివరించింది.
దేశమంతా ఒకటే టారిఫ్ అనేది సాధ్యం కాదని లేఖలో పేర్కొంది. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీని నగదుగా ఖాతాల్లోకి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఇది సామాజిక దుష్పరిణామాలకు దారితీస్తుందని వెల్లడించింది. రాయితీల అంశాన్నిరాష్ట్ర ప్రభుత్వాలకే విడిచి పెట్టాలని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా జలవిద్యుత్ పునరుద్పాక ఇంధన జాబితాలోనే ఉందని దేశంలోనూ జలవిద్యుత్ కు ఇదే నిర్వచనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన ఇచ్చింది. క్రాస్ సబ్సిడీ విధానం ప్రస్తుతం ఉన్నట్టే ఉండాలని లేఖలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ ఫ్రాంచైజీలు, సబ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సుల జారీ విషయంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఉండాలని డిస్కమ్ లు కోరుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోకుండా సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. విద్యుత్ లోడ్ డిస్పాచ్ ను కేంద్రం నియంత్రించటం సరికాదని రోజువారీ ఆపరేషన్ల ను రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్లకే విడిచిపెట్టాలని ప్రభుత్వం లేఖలో కోరింది.
ఇవీ చదవండి