గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక హోదాల్లో పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి... రాష్ట్ర పోలీసులపై నిరాధార ఆరోపణలు చేయటం సమంజసం కాదని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అనేక హోదాల్లో పనిచేసిన బాధ్యత గల వ్యక్తి మాట్లాడే మాటలకు ప్రజల్లో కొన్ని అంచనాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలని పేర్కొంది. 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మే 31 వరకూ రాష్ట్రంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు తదితర నేరాలతో పోలిస్తే... 2019 జూన్ 1 నుంచి 2020 జులై 31 మధ్య జరిగిన నేరాల సంఖ్య తక్కువగా ఉందని వివరిస్తూ ఆ గణాంకాలను ప్రకటనలో విడుదల చేసింది.
ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో గిరిజన మహిళ హత్య, రాజమహేంద్రవరంలో బాలికపై అత్యాచారం కేసుల్లో నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేశామని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణి కేసులో నిందితులపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.. పారదర్శక విచారణ కోసం సీఐడీకి అప్పగించామని వివరించింది. దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసుల్లో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ...ప్రకాశం జిల్లా చీరాల ఘటనలో, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపింది. దిశ కార్యక్రమాల్లో భాగంగా ఏడు రోజుల వ్యవధిలో 167 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామని ప్రకటనలో తెలిపింది. మూడు నెలల వ్యవధిలో 21 కేసుల్లో కఠిన శిక్షలు వేయించగలిగామని వివరించింది. దేశ వ్యాప్తంగా ఏపీ పోలీసు వృత్తి నైపుణ్య సామర్థ్యానికి గుర్తింపు ఉందని ప్రకటనలో వివరించింది.
ఇదీ చూడండి. బాలుడిని చితకబాదిన బంధువు... వీడియో వైరల్