CM Review Meeting on Godavari Krishna Penna Rivers Linking : జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా వాటర్ పాలసీ, గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంపై సమీక్షలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోదావరి - కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంపై మూడో పక్షంతో అధ్యనం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కృష్ణా వరద జలాలు బొల్లాపల్లికి తీసుకెళ్లే ప్రతిపాదనలను పరిశిలించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎన్ని ఉన్నా, గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం చేపట్టి తీరుతామని తేల్చిచెప్పారు. నవంబరు 22 తర్వాత పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు.
రెండు ప్రతిపాదనలపై చర్చ : ఇప్పటికే గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించామని సీఎం గుర్తు చేశారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కరవు లేకుండా నీళ్లు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. గోదావరి నుంచి కృష్ణాకు అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానంపై జలవనరులశాఖ ఇచ్చిన ప్రజంటేషన్‌పై ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు సీఎంకు వివరించారు. పోలవరం కుడి కాలువను మరింత వెడల్పు చేసి 40 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో గోదావరి వరద జలాలు మళ్లించడం, ప్రత్యేకంగా వరద కాలువ తవ్వి పోలవరం నీటిని ఎత్తిపోసి మళ్లించడం అన్న రెండు ప్రతిపాదనల్లోని సానుకూల ప్రతికూల అంశాలను ఆయన వివరించారు.
మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్‌గా మోదీ- ఐదో ప్లేస్‌లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే
మూడో పక్షంతో అధ్యయనం : కృష్ణా దాటిన తర్వాత బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి సోమశిలకు తరలించే ప్రతిపాదన ఒకటి, బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు తీసుకువెళ్లే మరో ప్రతిపాదనని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి ముందుంచారు. గోదావరి వరద జలాలు మాత్రమే బొల్లాపల్లికి తీసుకువెళ్లడం ఎందుకు? కృష్ణా వరద జలాలు కూడా బొల్లాపల్లికి తరలించవచ్చు కదా? అని సీఎం ప్రశ్నించారు. కృష్ణాలో వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి మళ్లించడం వృధా వ్యయం కదా అని చంద్రబాబు అన్నారు. కృష్ణా వరద ఉన్న రోజుల్లో ఆ నీటినే తీసుకువెళ్లేలా, లేని రోజుల్లో గోదావరి వరద మళ్లించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ అంశంపై మూడో పక్షంతో అధ్యయనం చేయించి తీసుకురావాలని చెప్పారు. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
పోలవరం ప్రాజెక్టుకు వస్తా : పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందంతో జరిగిన చర్చల సారాంశాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేయగలరో షెడ్యూలు తయారు చేయాలని సీఎం చెప్పారు. నవంబరు 22 తర్వాత ఏదో రోజు పోలవరం ప్రాజెక్టుకు వస్తానని ఆయన వెల్లడించారు. అక్కడ పోలవరం ఎప్పటికి పూర్తి చేసేది ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పోలవరం పునరావాసంపై కూడా చర్చ జరిగింది. తొలిదశ పునరావాసం కోసం 18,925 ఇళ్లు నిర్మించాల్సి ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ చెప్పారు.
త్వరలో నీటి విధానం : ఆ పనులు చేసే గుత్తేదారులకు రూ.155 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ఎప్పుడో 2018లో ఒప్పందాలు అయినందున ఆ ధరలకు చేసేందుకు వారు సిద్ధంగా లేరని చెప్పగా తగిన ప్రత్యామ్నాయాలు చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం భూసేకరణ, పునరావాసం పనులు సమాంతరంగా చేపట్టాలన్నారు. ఇందుకు రూ.2,600 కోట్లు అవసరమని చెప్పగా త్వరలోనే ఆ నిధులు సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి విధానం ప్రకటించనున్నందున ఆ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు ఉన్నాయో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
చంద్రబాబును కలిసిన విప్‌లు - సమర్థంగా పనిచేయాలని సూచించిన సీఎం
రాష్ట్రంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ