Andhra Pradesh state partition issue: విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ.. తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని వివిధ అంశాలపై తెలుగు దేశం పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని లోక్‌సభలో అడిగిన వివిధ ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
రామాయపట్నం పోర్టుకు బదులు.. మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని వెల్లడించిన కేంద్రం.. రూ.106 కోట్లతో సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కార్యాలయం నిర్మిస్తామని వెల్లడించింది. ఈ మేరకు 2023-24లో రూ.10కోట్లు కేటాయించినట్లు తెలిపింది. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదని, సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచరణ సాధ్యం కాలేదని చెప్పింది. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించగా.. నాన్- మేజర్ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేసినందున మైనర్ పోర్టును డి-నోటిఫై చేయాలని ఏపీకి చెప్పామని కేంద్రం వెల్లడించింది. రామాయపట్నం వద్దంటే మేజర్‌పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని సూచించినట్లు కేంద్రం తెలిపింది.
కడపలో అనవసరం.. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. వర్సిటీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధానికి రూ.21,154 కోట్లు ఇచ్చామని తెలిపింది. అదేవిధంగా ఐఐటీకి రూ.1,022 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేశామని కేంద్రం స్పష్టం చేసింది. ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు విడుదల చేశామని నివేదికలో పేర్కొంది.
నాడు.. నేడు.. సరిగ్గా ఏడాది కిందట బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ.. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకారం మాత్రమే అందించగలదని తెలిపింది. సమస్యల పరిష్కారానికి కచ్చితమైన సమయాన్ని చెప్పలేమని స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారానికి 2014 మే 12న ఏర్పాటు చేసిన కమిటీ.. ఇప్పటి వరకు 10 సార్లు సమావేశమైనట్లు వెల్లడించింది. విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికే అమలవుతున్నాయని, వివాదాల పరిష్కారం అన్నది నిరంతర ప్రక్రియ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. కచ్చితమైన సమయం చెప్పలేమని, ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కేవలం ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే సాధ్యమనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టం చేశారు. పరస్పర సర్దుబాటు, అవగాహనతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కేంద్రం సహకారం మాత్రమే అందించగలదు’ అని పునరుద్ఘాటించారు.