Ferro Alloy Industry : రానున్న ఆర్థిక సంవత్సారానికి రాష్ట్ర విద్యుత్తు టారిఫ్ ఆర్డర్ లో ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమపైనే భారం మోపారని, దానిని వెంటనే ఉపసంహరించనట్టయితే ఇవి మూతపడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తి దారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమ పరిశ్రమను పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఈతరహా పోటీదారులకు ధీటుగా నడపాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యుత్తు ఛార్జీల పెంపుదల నుంచి ఊరట నివ్వాలని కోరింది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి... విశాఖలో పరిశ్రమ దారుల సంఘం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 39 పరిశ్రమలలో 33 యూనిట్లు700 ఎంవీఏ పైగానే కాంట్రాక్టెడ్ ఎండీతో నడుస్తూ దాదాపు 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నది గుర్తించాలని కోరారు. ఈ కర్మాగారాలు మూతపడితే వీరంతా రోడ్డున పడడమే కాకుండా అనుబంధ రంగాల యూనిట్లకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇంధన చార్జీలు, ఇంధన ధరలు పెంచడం వల్ల భారం పెరిగింది. ఆ ప్రభావం కారణంగా 40వేలకు పైగా ఆధారపడిన కార్మికులు, వారి కుటుంబీకులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఏపీఈఆర్సీ డిమాండ్ చార్జీలు పెంచడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇలా నష్టాలను మేం ఎన్నాళ్లని భరించగలం. ప్రస్తుత టారిఫ్ ల కారణంగా ఇండస్ట్రీలు మూతపడే ప్రమాదం ఉంది. - షరాఫ్, ఛైర్మన్, ఫెర్రో ఎల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
మా కాంట్రాక్టులను గడవులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనపు చార్జీల వల్ల మేం ఇండస్ట్రీని మూసేయాల్సి వస్తుంది. ఇలాంటి అదనపు చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఆరు పైసల నుంచి ఒక రూపాయి చేసిన చార్జీని రోల్ బాక్ చేయాలి. ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఉపసంహరించుకోవాలి. ఎండీ చార్జీలను విత్ డ్రా చేయాలని కోరుతున్నాం. ఇండస్ట్రీ సవ్యంగా సాగాలని కోరుతున్నాం. పాత ఆరు పైసల చార్జీని కొనసాగించాలని కోరుతున్నాం. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారంతా వీధిన పడకుండా ఇండస్ట్రీని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. - శర్మ, సీఈవో, ఫేకర్
ఐపీఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ వేదకలోనే మా సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చాం. దానికి వారు అంగీకరించారు. టీఓడీ టారిఫ్ ను మా పరిశ్రమలకు వర్తింపజేయడం సరికాదు. సంవత్సరం పొడవునా నడిపే ఇలాంటి పరిశ్రమలపై ఈ చార్జీలు ఏ మాత్రం సరికాదు. దీని వల్ల సంవత్సరానికి 240 నుంచి 250 కోట్ల రూపాయల రెవెన్యూ రావచ్చేమో గానీ, మేం ఏడాది పొడవునా ప్రతి నెలా ఇచ్చే 400 నుంచి 450 కోట్లు.. ఏటా సుమారు 4500కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి, సంబంధిత శాఖల సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు. - పీఎస్ఆర్ రాజు ఉపాధ్యక్షుడు, ఫెర్రో ఎల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
డిమాండ్ ఛార్జీల విధింపును ఉపసంహరించి, సింగిల్ పార్ట్ టారిఫ్ విధానాన్నే కొనసాగించాలన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీని యూనిట్ కి ప్రస్తుతం ఉన్న వంద పైసల పెంపుదల నుంచి ఆరుపైసలకు తిరిగి తగ్గించాలని కోరారు.
ఇవీ చదవండి :