All Party Leaders Condemned Chandrababu Arrest: చంద్రబాబును అరెస్టు చేసిన తీరును అఖిలపక్ష పార్టీల నేతలు ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కిందని అఖిలపక్ష పార్టీల నేతలు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలపై ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (Round Table Meeting)లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తీరును ప్రతి ఒక్కరూ ఖండించారు.
కేసులకు భయపడి, నీటిపారుదల రంగాన్ని గాలికొదిలేశారు.. అఖిలపక్షనేతల మండిపాటు
All Party Leaders Fires on CM Jagan: వ్యవస్థలను మేనేజ్ చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని అఖిలపక్ష నేతలు విమర్శించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పోలీసులు వైసీపీ ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేస్తున్నారని టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ నేతలు మండిపడ్డారు. చంద్రబాబుని అరెస్టు చేసిన తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. ప్రజలకు మేలు చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం పరితపించిన వ్యక్తి చంద్రబాబు అని వక్తలు అభిప్రాయపడ్డారు.
Doubt on Chandrababu Security in Jail: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ (skill Development) వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగలేదని, వైసీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని వేధిస్తోందని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబు తప్పే చేసుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు ఏం చేసిందని.. అప్పుడు కేసులు నమోదు చెయ్యొచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం (Ambedkar Constitution) ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుల్ని అణచివేస్తున్నారు. వ్యవస్థల్ని ఉపయోగించుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు.
వ్యవస్థలు మేనేజ్ చెయ్యడం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని అఖిలపక్ష నేతలు (All party leaders) అభిప్రాయ పడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడడానికి వైసీపీ నేతలు ఎంతో మేనేజ్ చేశారన్నారు. అవినీతి లో పూర్తిగా కూరుకుపోయిన వైసీపీ నాయకులు చంద్రబాబును అవినీతి పరుడని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల నిర్బంధం రాష్ట్రంలో పెరిగిందని అఖిలపక్ష నేతలు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగిస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.
సీబీఐ, ఈడీ, మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది అని జనసేన నేత పోతిన మహేశ్ అన్నారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలే తప్ప.. ఈ రకంగా అరెస్టులు సరికాదు అని యావత్ దేశం ఖండిస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదు. జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారేచ్ఛతో పనిచేస్తున్నాడు. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (CPI State Secretary Ramakrishna) తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులను ప్రయోగించి నిర్బంధించడం సరైంది కాదన్నారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగిస్తే వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.