Aided Telugu Medium Schools Situation: ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో ఒకప్పుడు తెలుగు మీడియంలో ఓ వెలుగు వెలిగిన ఎయిడెడ్ పాఠశాలలు విలీన ప్రక్రియ తర్వాత ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రధానంగా వీటిని ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది అనే విమర్శలు వస్తున్నాయి.
ఉపాధ్యాయుల నియామకాలు ఆపేశారు. ఉన్న వాళ్లలోనూ ఎక్కువ మందిని విలీనం తర్వాత ప్రభుత్వంలో కలిపేశారు. ఇక మిగిలిన పాఠశాలల్లో అరకొర ఉపాధ్యాయులే ఉన్నారు. దీంతో చాలా పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరు. విజయవాడలోని అర్జునవీధిలో ఉన్న తెలుగు విద్యాలయ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో కేవలం సోషల్, తెలుగు, గణితం బోధించే ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ, సైన్స్ బోధించేవాళ్లు లేరు. కనీసం తాత్కాలిక సిబ్బందిని అయినా నియమించడం లేదు. దీంతో యాజమాన్యాలు కూడా ఈ పాఠశాలలను పట్టించుకోవడం మానేశాయి.
Students fire on NADU-NEDU: ప్రారంభమైన సర్కారీ బడులు..నత్తనడకన నాడు-నేడు పనులు..
విజయవాడ నగరంలో మాంటిస్సోరి లాంటి ప్రముఖ ఎయిడెడ్ పాఠశాలలను పూర్తిగా మూసివేయగా.. మిగిలిన వాటిలో తెలుగు మాధ్యమం కనుమరుగవుతోంది. ఈ ఏడాది నుంచి పాతబస్తీలోని ప్రముఖ ఎయిడెడ్ విద్యాసంస్థ ఎస్.జె.పి.వి.వి. హిందూ హైస్కూల్లో తెలుగు మాధ్యమాన్ని మూసేశారు. ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంచారు. పాఠశాలల్లో సిబ్బంది.. ఒక్కొక్కరిగా పదవీ విరమణ పొందుతున్నా తిరిగి వారి స్థానంలో ఎవరినీ నియమించడం లేదు. ఆయా విద్యా సంస్ధల్లో విద్యార్థులను చేర్పించేందుకు కనీస ప్రయత్నం చేయడం లేదు.
నిబంధనల కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నా వారితోనే నెట్టుకొస్తూ, చివరికి ఆయా స్కూల్స్‌ను మూసేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రొత్సహించడాన్ని తప్పుపట్టడం లేదని కానీ తెలుగు మాధ్యమ పాఠశాలలను చిన్నచూపు చూడటం మంచిది కాదని విశ్రాంత ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికే విద్యార్దులు తెలుగు భాషపై పట్టును కొల్పోతున్నారని, ఇదే విధానం కొనసాగితే తెలుగు భాషను చరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు.
Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం పొరుగురాష్ట్రాల బాటలో..
ఎయిడెడ్ పాఠశాలల విలీనం తప్పుకాదని.. అయితే ఆంగ్ల మాధ్యమంతోపాటు.. తెలుగు మాధ్యమం తప్పక కొనసాగించాలని విశ్రాంత ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. విద్యార్థులపై బలవంతంగా ఆంగ్ల మాధ్యమం రుద్ది.. వారిని అయోమయానికి గురిచేస్తున్నారని.. విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్ తెలుగు మాధ్యమం పాఠశాలలు కూడా ఆంగ్ల మాధ్యమం వైపు వెళ్తున్న పరిణామాలతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తెలుగు మాధ్యమ పాఠశాలలను కూడా అభివృద్ది చేయాలని కోరుతున్నారు.