ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనిశా తొలిరోజు ఆకస్మిక తనిఖీలు ముగిశాయి. సిబ్బంది చేస్తున్న లోపాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా జిల్లా గుడివాడ
కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అనిశా ఏఎస్పీ మహేశ్వర రాజు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఔషధాలు నిల్వలను పరిశీలించిన అధికారులు.... రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ తనిఖీలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లా భోగాపురం
విజయనగరం జిల్లా భోగాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అనిశా అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో కొన్ని లోపాలు తలెత్తడం వాటికి సంబంధించి ఆధారాల సేకరణ చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. వైద్య సిబ్బందిని నుంచి వివరాలు తెలుసుకున్న అనంతరం ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో ఏసీబీ ఏఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. 30 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మందుల నిల్వలు, రోగులకు పంపిణీ చేస్తున్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కేటాయించిన నిధులు, ఖర్చులకు సబంధించిన రికార్డులను పరిశీలించారు. రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించిన అధికారులు... వైద్యం అందుతున్న పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డ్‌లో రోగులకు అందుతున్న భోజనాలు ప్యాకెట్లను పరిశీలించారు. ఏసీబీ అధికారుల తనిఖీలతో పలు ఉద్యోగులు గోడ దూకి పరారయ్యారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించిన అధికారులు ఒప్పంద ఉద్యోగుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి దస్త్రాలను పరిశీలించిన అనంతరం వివరాలు తెలియజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలను చేపట్టారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అనిశా అధికారుల విస్తృత తనిఖీలు చేపట్టారు. రికార్డులు, మందులను పరిశీలించారు. అనంతరం వార్డులోని రోగులతో మాట్లాడి వైద్య సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఇక్కడ తాగడానికి నీళ్లు లేక బయటనుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని రోగులు వివరించారు.
గుంటూరు జిల్లా తెనాలి
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వాసుపత్రిలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రెండు రోజుల పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఏసీబీ గుంటూరు అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపారు. ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిపై ఒక నివేదిక తయారు చేసి ఉన్నాధికారులకు అందిస్తామని వివరించారు.
కడప జిల్లా రాజంపేట
కడప జిల్లా రాజంపేటలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా మందులు కొనుగోలు, ఆస్పత్రిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించిన బిల్లులు, పరికరాల కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అన్ని రికార్డులను అనిశా డీఎస్పీ జనార్దన్ నాయుడు పర్యవేక్షణలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి
అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రిలో అనిశా అధికారుల సోదాలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు విభాగాలకు చెందిన రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో ఇద్దరు ఏసీబీ సీఐలతో పాటు మరో 5 మంది ఏసీబీ సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.