ఓటరు లిస్ట్‌లో అవకతవకలపై ఎస్ఈసీకి తెదేపా ఫిర్యాదు - మచిలీపట్నం ఓటర్ల లిస్ట్‌పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల ఓటరు లిస్ట్‌లో అవకతవకలపై తెదేపా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో.. ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి ఫిర్యాదు పత్రం అందించారు.
మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల ఓటరు లిస్ట్‌లో మార్పులు జరిగాయంటూ... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తెదేపా నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపినప్పటికి.. కొత్త ఓటర్లను చేర్చుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. మచిలీపట్నంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని విమర్శించారు.
అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, వైకాపాకి అనుకూలంగా ఉండే వారిని.. ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారులను అడిగితే సరిగా స్పందించలేదని కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకే చేస్తున్నామని.. సమాధానం ఇస్తున్నట్లు విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటరు జాబితాలో మార్పులు చేసిన అధికారులపై.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.