P. Gannavaram MLA Kondeti Chittibabu: గడప గడపకు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తుంటే.. మా సమస్యల సంగతి ఏంటంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలు వారి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడం పరిపాటిగా మారిపోయింది. అలాంటి సందర్భాల్లో సమాధానం చెప్పలేక కొందరు ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేయడమో.. లేదా ప్రశ్నించిన వారిపై దాడి చేయడమో పరిపాటిగా మారిపోయిన రోజుల్లో.. పి.గన్నవరం ఎమ్మెల్యేకు ఓ యువకుడి నుంచి నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న యువకుడు, గ్రామస్థులతో కలిసి తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సమస్యలతో స్వాగతం పలికాడు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు సాధారణ పౌరుడు తన ప్రశ్నలతో చుక్కలు చూపించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లికి వచ్చిన ఎమ్మెల్యేను.. గ్రామంలోకి రాకుండానే ఆపి గ్రామస్థులతో కలిసి నిలదీశాడు. చాలా పద్ధతిగా, తప్పించుకోవడానికి వీలు లేకుండా రహదారుల సమస్యపై ప్రశ్నించాడు. 4 ఏళ్ల కాలంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నాడు. ఎమ్మెల్యే అనుచరులు అతడ్ని ఆపే ప్రయత్నం చేసినా.. ఊరుకోకుండా గట్టిగా ప్రశ్నించాడు. చేసేదేమీ లేక పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు.
నాలుగేళ్ల కాలంలో గ్రామాన్ని ఏం అభివృద్ధి చేసావంటూ ఎమ్మెల్యేపై గ్రామస్థులు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల తరువాత సచివాలయాల శంకుస్థాపనలకు తప్పా.. ఎప్పుడూ మా గ్రామంలోకి రాలేదు.. ఇప్పుడు ఎందుకొచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిట్టిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తిరగబడటంతో పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే తప్పించుకున్నారు.
'మా గ్రామంలోకి మీరు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. అదీ మీరు మా సమస్యలపై స్పందించడానికి కాదు. మిమ్మల్ని జగన్ గడప గడపకు అంటూ గ్రామాల్లో తిరగమంటున్నారు కనుకనే వచ్చారు. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లము కాదు. మాకు రోడ్డు వేస్తే మీ వెనకాలైనా తిరుగుతాం. కానీ మీరు మాత్రం గత నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారైనా మా గ్రామంలో జరిగిన గ్రామసభకు వచ్చారా. మా గ్రామ రహదారి సమస్యలు మీకు తెలియాలనే ప్రశ్నిస్తున్నాం. ఈ 4 ఏళ్ల కాలంలో మీ వల్ల గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.'- పసుపల్లి గ్రామానికి చెందిన యువకుడు
ఇవీ చదవండి: