SIT interrogated lawyer Srinivas: తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా నిన్న, ఈరోజు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి అభిమానంతోనే విమానం టికెట్ బుక్ చేశానని, అంతకుమించి ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని శ్రీనివాస్ తెలిపారు. రెండోరోజు విచారణకు హాజరైన ఆయన్ను దాదాపు 7గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.
విచారణ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనకు భాజపాతో ఎలాంటి సంబంధం లేదని, ఎమ్మెల్యేల ఎర కేసుతోనూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో పూజలు చేయించుకున్న క్రమంలో సింహయాజీ స్వామీజీతో పరిచయం ఏర్పడిందని, ఆ అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్టు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
ముగ్గురు నిందితుల కస్టడీ పిటిష్‌పై విచారణ రేపటికి వాయిదా: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈకేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఇప్పటికే నిందితులను రెండ్రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో ఈరోజు కౌంటరు దాఖలు చేశారు. దీనిపై రేపు వాదనలు వింటామని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి: