Ramadevi Public School Sports Festival : తెలంగాణలోని హైదరాబాద్‌లో రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో స్పోర్ట్స్ డే సందర్భంగా.. మైదానంలో ఎన్సీసీ క్యాడెట్లు అతిథులకు మార్చ్‌ఫాస్ట్ ద్వారా ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంస్కృతిక నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ జెండాతో పాటు పాఠశాల, క్రీడలకు సంబంధించిన జెండాలను ఆవిష్కరించారు. క్రీడాజ్యోతిని వెలిగించి మైదానం చుట్టూ ప్రదర్శించారు.
పాఠశాలలో గంగా, యమున, కావేరి, కృష్ణ అనే నదుల పేర్లతో ఉన్న హౌసెస్ మధ్య పోటీలు పెట్టగా.. వారిలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కుమారుడు సుజయ్ చదరంగం ఛాంపియన్లతో సరదాగా చెస్ ఆడారు. పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు 'రామోజీ బంగారు పతకాన్ని' అందించారు. సైన్స్, లెక్కల సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన మరో ఐదుగురికి 'ఈనాడు బంగారు పతకాన్ని' ప్రదానం చేశారు. పాఠశాల తరఫున జాతీయ స్థాయిలో క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
మైదానంలో వివిధ రూపాల్లో వ్యాయామ నృత్యాలు చేసిన విద్యార్థులకు ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాలని సూచించారు. అంతకు ముందు పాఠశాల తరగతి గదులను పరిశీలించిన ఆమె.. డిజిటల్ తరగతి గదిలో కూర్చొని పాఠాలు విన్నారు.
"పాఠశాల తరఫున జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు. మైదానంలో వ్యాయామ నృత్యాలు చేసిన విద్యార్థులకు అభినందనలు. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ముఖ్యం. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాలి." - సి.హెచ్. విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ
సక్సెస్ అనేది అంత సులువుగా రాదని, దాని కోసం తపన, కృషి ఉంటేనే విజయం వరిస్తుందని రమాదేవి ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి ఏటా తమ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎల్కేజీ నుంచే డిజిటల్ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు పాఠాలను అలవాటు చేస్తున్నట్లు స్కూల్ వైస్ ప్రిన్సిపల్ కమర్ సుల్తానా తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తొలి దశ నుంచే మంచి విజ్ఞానాన్ని పొందాలన్న ఆహుతులు.. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల్లో చురుకుదనాన్ని పెంపొందిస్తాయన్నారు..
"విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా క్రీడలలో, పోటీ పరీక్షల్లో ముందుకు తీసుకువెళ్లాలని.. దానికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నాము. దేశంలోని అన్ని పాఠశాలల్లో డిజిటలైజేషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలి. అందుకే మా స్కూల్‌లో ఎల్కేజీ నుంచి కూడా డిజిటల్ పాఠాలను బోధిస్తున్నాము. కంప్యూటర్ అప్లికేషన్‌ను 4వ తరగతి నుంచే తీసుకురావడం జరిగింది." - డాక్టర్ రావి చంద్రశేఖరరావు, రమాదేవి ట్రస్టీ
"పాఠశాలలో నిర్వహించిన వివిధ రకాల క్రీడల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు నాలుగు రామోజీ బంగారు పతకాలు, ఐదు ఈనాడు పతకాలు ఇచ్చాము. ఉత్తమ ఎన్సీసీ అవార్డు ఇచ్చాము. ప్రతి విద్యార్థి ఆటలు ఆడాలి." - కమర్ సుల్తానా, వైస్ ప్రిన్సిపల్, రమాదేవి పబ్లిక్ స్కూల్
ఇవీ చదవండి: