FLOODS: పరివాహక గ్రామాలకు కనీవినీ ఎరుగని కష్టాల్ని పరిచయం చేసిన ప్రళయ గోదారి శాంతించినా.. తీరం వెంబడి ప్రజలు ఇంకా వరద గుప్పిట్లోనే మగ్గుతున్నారు. తినటానికి తిండి, తాగేందుకు నీరు లభించక కోనసీమ లంకవాసులు అల్లాడుతున్నారు. విలీన మండలాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అధికారులు అందించే అరకొర సాయంతో పెద్దలు, పిల్లలు ఆకలితో ఆలమటిస్తున్నామని వాపోతున్నారు.
కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 75 గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. పి.గన్నవరం మండలంలోని రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి లంకల్లో ఇళ్లపైనే బాధితులు తలదాచుకుంటున్నారు. ముమ్మడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలంలోని లంక గ్రామాల ప్రజల్ని కనీస అవసరాల కోసం అనేక కష్టాలు పడుతున్నారు. పొట్టిలంక, అయినివిల్లి లంక, కేదార్లంక, నారాయణలంకల్లో నీట మునిగిన పంటల్ని చూసి రైతుల కన్నీరు పెట్టుకున్నారు.
ప్రభుత్వ పరంగా తమకు ఎలాంటి సహాయం అందలేదని కోనసీమ జిల్లా లంకల గన్నవరం వరద బాధితులు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రకు మొరపెట్టుకున్నారు. అందరికి నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
బడుగు వాణి లంకలో బాధితులకు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆహార పొట్లాలు అందించారు. నున్నవారిబాడవ, తాటిపాక మఠంలోని వరద బాధితులను మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, తెదేపా శ్రేణులతో కలసి పరామర్శించారు.
గోదారి ఉద్ధృతికి అతలాకుతలమైన వేలేరుపాడు ఇంకా వరద ముంపులోనే మగ్గుతోంది. అధికారులు గ్రామంలోని అందరిని సురక్షితంగా బయటకు చేర్చారు. వరద ముంపులో చిక్కుకున్న లంకవాసుల్ని మత్స్యకారులు పడవల్లో క్షేమంగా తరలిస్తున్నారు. అయితే ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల్ని కాపాడుతున్న తమకు రెండేళ్ల కిందటి డబ్బులే ఇంకా చెల్లించలేదని వాపోతున్నారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, వేణుగోపాల కృష్ణ అల్లూరి జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులకు సహాయచర్యలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇవీ చదవండి: