Konaseema Flood Victims Problems: సంక్షేమ పథకాల బటన్ నొక్కే ప్రతిసారీ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పే జగన్ మోహన్ రెడ్డి.. గోదావరి వరదల బాధిత కుటుంబాలను గాలికి వదిలేశారు. వరద వెల్లువెత్తిన సమయంలో అన్నం పెట్టలేదు. నిత్యావసరాలు ఇవ్వలేదు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారి గోడూ పట్టించుకోవడం లేదు. ముంపు బారిన పడిన గ్రామాల్లో బురద తొలగింపు, పారిశుద్ధ్య చర్యలూ చేపట్టడం లేదు. నిన్నటి వరకు గ్రామాల్లో వరద పారడంతో తాగునీటి వనరులన్నీ కలుషితమయ్యాయి.
గోదారమ్మ ఉగ్రరూపంతో అల్లాడిపోయిన కోనసీమ లంక గ్రామాల ప్రజలు.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదనీటి నుంచి రోడ్లు బయటపడటంతో.. సజావుగా రాకపోకలు సాగిస్తున్నారు. వరద ధాటికి పొలాలన్నీ నీటమునిగి, పంటలన్నీ కుళ్లిపోయి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వచ్చే రెండు నెలల వరకు ఎలాంటి పనులు ఉండవని.. ఈ పరిస్థితుల్లో జీవనం ఎలా సాగించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగ, అరటి, మిరప, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయని.. వరద తగ్గుతున్నా పంట నష్టం పరిశీలనకు అధికారులు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
వరద బాధిత ప్రాంతాలకు 5 రకాల సరకుల అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. బియ్యం, కందిపప్పు మాత్రమే ఇస్తోందని అంటున్నారు. నూనె, కూరగాయలు లాంటివేమీ పంపిణీ చేయడం లేదని చెబుతున్నారు. దెబ్బతిన్న కచ్చా ఇళ్లకు ఇస్తామన్న రూ.10 వేలు ఎప్పుడిస్తారనే ప్రశ్న బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లాలో వరద తగ్గడంతో వేల కుటుంబాలు ఇళ్లకు చేరుతున్నాయి. ఇళ్లలో నిండిన బురదను ఎలా తొలగించాలనేది పెద్ద సమస్యగా తయారైంది. పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటప్పుడు ఇస్తామన్న రూ.2 వేలు వెంటనే ఇస్తే ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడతాయని బాధితులు పేర్కొంటున్నారు. ప్రచారం తప్పితే.. సరకులివ్వడం లేదు.
గ్రామాల్లో వరద నీరు బయటకు పోవడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొన్నిచోట్ల నిత్యావసర సరకుల పంపిణీ ప్రారంభించారు. '25 కిలోల బియ్యం, లీటరు పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళాదుంపలు పంపిణీ చేస్తున్నాం. సమస్యలుంటే స్థానిక తహసీల్దారును సంప్రదించండి' అని కలెక్టర్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో పేర్కొన్నట్లు వరద బాధితులకు సాయం ఎక్కడా అందడం లేదు. 5 రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు కొందరు నాయకులు, అధికారులు ఫొటోలు దిగి వెళ్లి పోయారు.
సరకుల విషయమై అధికారులను సంప్రదించగా.. మిగిలినవి ఇవాళ అందిస్తామని అంటున్నారు. ముంపు గ్రామాల్లో శానిజైటేషన్ పనులు జరుగుతున్నాయని.. వరద బాధిత గ్రామాల్లోనే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా.. వరదల వల్ల సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.