Rape of Minor Girl: నీళ్ల కోసం వెళ్లిన ఓ మైనర్ బాలికపై కొంతమంది అత్యాచారానికి పాల్పడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సముద్ర తీర మత్స్యకార గ్రామం చిర్రయానాంలో 17 ఏళ్ల బాలికపై అయిదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా అనేక ప్రయత్నాలు చేశారు. కానీ రాజీలో తేడాలు రావడంతో విషయం బయటకు పొక్కింది.
కాట్రేనికోన సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల ఆరవ తేదీన బాధిత బాలిక గ్రామానికి సమీపంలో ఈలకర్ర తోటలో ఉన్న మంచినీటి కుంటకు నీళ్ల కోసం వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరువాత.. బాధిత బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఐదుగురి యువకుల్లో ఒకరు ముమ్మడివరం శాసనసభ్యులు సతీష్ కుమార్ ప్రధాన అనుచరుడు.. స్థానిక సర్పంచ్ కుమారుడు అని ఆరోపణలు రావడంతో గ్రామ కట్టుబాటు ప్రకారం పెద్దల పంచాయతీ నిర్వహించారు.
బాధిత బాలిక కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇచ్చేందుకు తీర్మానించడం జరిగింది. దానికి బాధిత బాలిక కుటుంబం అంగీకరించకపోవడంతో.. ఈ జరిగిన ఘటన వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం బయటపడింది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తక్షణం స్పందించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్తో కలిసి చిర్రయానాం గ్రామంలో విచారణ చేపట్టారు.
బాలికపై అత్యాచారం జరిగిన విషయం నిర్ధరణ కావడంతో పోలీసులు గ్రామంలో ఇళ్లను తనిఖీ చేసి ఐదుగురి యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని.. చార్జిషీట్ వేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ జానకిరామ్ తెలిపారు.
రాజకీయంగా పలుకుబడి ఉండటంతో కేసును తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా గురువారం.. గ్రామంలో హైడ్రామా నడిచింది. యువకులకు కఠిన శిక్షలు విధించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.
అదే విధంగా బాలికపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డితో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇవీ చదవండి: