High court on hostel conditions: గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో సౌకర్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. వసతిగృహాల్లో నేలపై నిద్రించే పరిస్థితి వస్తే మన పిల్లల్ని చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిద్రించేందుకు మంచం, పరుపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం... ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం అంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వసతిగృహాల్లో సౌకర్యాల మెరుగుకు సమయం అసన్నమైందని హైకోర్టు (AP High Court) పేర్కొంది. గోడిలోని గురుకుల పాఠశాల, వసతి గృహంలో అసౌకర్యాలపై విచారణ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. గురుకుల పాఠశాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.7లక్షల విద్యార్థులకు బెడ్లు, మంచాలు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటుగా.. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ... పి. బాబ్జీ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్, న్యాయవాది జై భీమారావు వాదనలు వినిపించారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయమూర్తిని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించింది.
అధ్వానంగా వసతిగృహాలు.. విద్యార్థులకు తప్పని తిప్పలు
తూర్పుగోదావరి జిల్లా జడ్జితో నివేదిక: వసతిగృహాల్లోని పరిస్థితులపై తూర్పుగోదావరి జిల్లా జడ్జి వసతిగృహంలోని పరిస్థితులపై విచారణ చేపట్టారు. అనంతరం హైకోర్టుకు తన నివేదిక అందించారు. ఈ నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం.. ఇటీవల కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ సందర్భంలో నివేదికలోని అంశాలపై విస్మయం వ్యక్తం చేసింది. వసతిగృహంలో నాలుగు వందల మంది విద్యార్థులకు... కేవలం రెండే టాయిలెట్లు ఉన్నాయని తెలిపింది. బెడ్లు లేక విద్యార్థులు నేల మీదే పడుకుంటున్నారని నివేదికలో ప్రస్తావించినట్లు కోర్టు తెలిపింది. వారికి దుప్పట్లూ ఇవ్వలేదని.. లైట్లు, గదుల్లో తగినన్ని ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు సైతం సక్రమంగా లేవని నివేదికలో తెలింది. వంటగది నుంచి వచ్చే వ్యర్థాలను సమీపంలో కుమ్మరించడంతో దోమలు కుడుతున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఒక్క గదిలోనైనా టేబుల్ లేదని.. విద్యార్థుల వస్తువులు, పుస్తకాలు దాచుకునే ట్రంకు పెట్టెలూ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సీఎస్‌ఆర్ నిధులతో పాటుగా... ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే నిధులపై ఆధారపడి ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారన్న అంశాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది.
Pregnant women problems: ఈ గర్భిణుల వసతిగృహాలు అప్పట్లో ఆదర్శం.. ప్రస్తుతం అధ్వానంగా