Crops Loss Due to Rains : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. చేతికందే సమయంలో వర్షాల కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పంట కాలం ఆశించినా దిగుబడులు రాక నష్టాన్ని చవిచూశామని.. ఈ సారి పంటలైనా నష్టాల నుంచి గట్టెక్కిస్తాయని అనుకుంటే వర్షాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందిన పంట కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం భారీ వర్షాలకు తడిసిపోయింది. ఆరబెట్టటానికి వీలు లేకుండా ఆకాశంలో మబ్బులు, వానతో ధాన్యం ఆరటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కోనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లక్షల ఎకరాల్లో పంటలు కోత దశకు చేరుకున్నాయి. 70 శాతం వరకు రైతులు పంటలను కోసి కల్లాల్లో ఆరబెట్టారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందో లేదోననే తెలియని ఆయోమయంలో రైతులు ఉండగా.. అకాల వర్షాలతో ధాన్యం కల్లాల్లోనే తడిసిపోయింది. కోయకుండా మిగిలిన పంటలు పొలాల్లోనే తడిసి ముద్దయ్యాయి. చేతికి అందిన పంట కళ్ల ముందే తడుస్తున్నా ఏమి చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవటంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తారా.. రైస్ మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తారా తెలియదని రైతులు అంటున్నారు. దీనివల్ల అడపాదడపా ధరకు పంటలను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దళారులు క్వింటాలుకు 1100 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు కొంటామంటున్నారని వాపోతున్నారు. నిల్వ చేయటానికి సరైన సౌకర్యాలు లేకపోవటంతో వర్షానికి ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు పరదాలు దొరకటం లేదని.. ప్రభుత్వం కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయటం లేదంటున్నారు. ఈ అకాల వర్షాల ఏం చేయాలో అర్థం కావటం లేదని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు భూ యాజమానులకే వర్తిస్తున్నాయని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. 90 శాతం వరకు కౌలు రైతులే పంటలు పండిస్తున్నారని.. ప్రభుత్వం అందించే ఒక్క రూపాయి కౌలు రైతులకు అందటం లేదని వాపోయారు. ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కోనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
"తొలకరి పంట పోయింది. ఈ పంటైనా చేతి వస్తుందని అనుకున్నాము. చేతికి వచ్చే సమయంలో వానలు వచ్చాయి. ప్రభుత్వం కోనుగోలు చేస్తుందో లేదో తెలియదు. దళారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనగోలు చేస్తున్నారు." -రైతు
"కౌలు రైతు నాశనమైపోతున్నాడు. కూలీలకు అధిక డబ్బులు చెల్లించి పంటలు పండించాము. ప్రైవేటు వ్యక్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తామంటున్నారు. ఈ సంవత్సరం పంటలు నష్టపోయాము." - కౌలు రైతు
ఇవీ చదవండి :