YSRCP Samajika Sadhikara Bus Yatra: కాకినాడలో వైసీపీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర జనం లేక వెలవెలబోయింది. మంత్రులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతుండగానే మహిళలు, సమావేశానికి వచ్చిన వారు బయటికి వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు పోలీసులు, స్థానిక నాయకులు తంటాలు పడ్డారు. బారికేడ్లు పెట్టి ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మీటింగ్ పూర్తయ్యే వరకు ఉండాలని చెప్పి ప్రాధేయపడ్డారు. అయినా వినకుండా మహిళలు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు. మంత్రులు, నేతలు ప్రసంగిస్తున్న సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
సామాజిక సాధికార బస్సు యాత్రకు మధ్యాహ్నం నుంచే డ్వాక్రా మహిళలతో పాటు లబ్ధిదారుల్ని వివిధ ప్రాంతాల నుంచి తరలించారు. సాయంత్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి మంత్రుల బస్సు ర్యాలీగా సర్పవరం జంక్షన్ వద్దకు వచ్చింది. అప్పటికే గంటలకొద్దీ వారంతా వేచి ఉన్నారు. ప్రజాప్రతినిధులు వచ్చి ప్రసంగాలు ప్రారంభించగానే అక్కడ నుంచి బయటికి వెళ్లిపోవడం ప్రారంభించారు.
తుస్సు మంటున్న వైసీపీ బస్సు యాత్రలు - సభ మధ్యలోనే ఇంటిముఖం పడుతున్న కార్యకర్తలు
ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌తో తంటాలు: వైసీపీ నేతలకు అడ్డు వస్తే ఏదైనా సరే తీసేస్తాం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. సీఎం జగన్ ఫొటోకు అడ్డుగా ఉందని.. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌తో ఎన్నో తంటాలు పడ్డారు. ఈలోపు కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అందకపోయినా సరే.. నిచ్చెనలు ఎక్కి మరీ.. వాటిని కిందకు దింపారు.
కాకినాడ జిల్లా సర్పవరంలో వైసీపీ సామాజిక సాధికార సభ కోసం వైసీపీ నేతలు.. ఇలా హంగామా చేశారు. సభ కోసం సర్పవరం జంక్షన్‌ను పార్టీ ప్లెక్సీలు, బ్యానర్లమయం చేశారు. జగన్ స్వయంగా పర్యటిస్తే.. చెట్టుకొమ్మలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే అధికారులు.. ఇప్పుడు ఆయన ప్లెక్సీ కోసం సిగ్నల్ లైట్లను కదిలించడం చూసి అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.
'రహదారి బంద్'గా మారిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర
బారికేడ్లు పెట్టి బతిమలాడుకున్నారు: వైసీపీ నేతలు ఇన్ని ఏర్పాట్లు చేస్తే.. చివరకు సభ తుస్సుమనిపించింది. సర్పవరం జంక్షన్‌ను పూర్తిగా జామ్ చేశారు. చూట్టూ బారికేడ్లు పెట్టారు. కుర్చీలు కూడా పెద్ద సంఖ్యలో వేశారు. సభ కిటకిటలాడుతుందేమో అనుకుంటే .. చివరకు జనం లేక వెలవెలబోయింది. సభలో జనం కన్నా.. ఖాళీ కుర్చీలే ఎక్కువ కనిపించాయి.
ఇక వైసీపీ నేతల ప్రసంగాలు మొదలవగానే.. జనం ఒక్కొక్కరుగా జారుకున్నారు. బారికేడ్లు పెట్టినా ఆగలేదు. చివరకు వైసీపీ నాయకులే.. బారికేడ్ల వద్దకు వెళ్లి కాసేపు కూర్చోవాలంటూ.. బతిమలాడుకున్నారు. చేతులు కూడా అడ్డుపెట్టారు. కానీ మహిళలు పదండి ముందుకు పదండి తోసుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు బారికేడ్ల మధ్య ఉన్న చిన్నపాటి సందుల్లో నుంచే దూరిపోయారు.
ప్రజలు లేక వెలవెలబోయిన సామాజిక సాధికార యాత్ర! మంత్రులు మాట్లాడుతుండగానే వెనుతిరిగిన మహిళలు
బస్సు ముందున్న జనాల కంటే బస్సుపైనే ఎక్కువ మంది: ఇదంతా ఒక ఎత్తైతే వైసీపీ నేతల బస్సు ఆగమనం మరో ఎత్తు. ఈపాటి ఖాళీ కుర్చీల కోసం నేతలు బస్సు నిండుగా ఎక్కేశారు. ఓ దశలో.. బస్సు ఒకవైపునకు ఒరిగింది. ఎందుకైనా మంచిదని బస్సును రోడ్డు మధ్యలో ఆపి.. కొంతమందిని కిందకు దించారు. ఇంత కష్టపడినా.. చివరకు బస్సు ముందున్న జనాల కంటే బస్సుపైనే ఎక్కువ మంది ఉన్నారంటూ.. వ్యంగ్యాస్తాలు వినిపించాయి.