TDP leaders sensational comments on YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కూన రవికుమార్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబులు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం రైతులకు చేస్తున్నది.. రైతు భరోసా కాదని, అది రైతు మోసం, రైతు దగా అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా బూటకమని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా పడిపోయాయని, భూముల క్రయవిక్రయాలు బాగా మందగించాయని పేర్కొన్నారు.
అది రైతు భరోసా కాదు.. రైతు మోసం, రైతు దగా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా అయిదోవ విడత నిధులను విడుదల చేశారు. అనంతరం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. రైతన్నకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నివాసానికి విచ్చేసిన ఆయన.. జగన్ ప్రభుత్వం చేస్తున్నది.. రైతు భరోసా కాదని, అది రైతు మోసం, రైతు దగా అని మండిపడ్డారు.
TDP leaders on Jagan: తాడేపల్లి ప్యాలెస్లో 2వేల నోట్లు.. జగన్ గుండేల్లో వణుకు: టీడీపీ నేతలు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు గెలవడం ఖాయం.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ..''గోదావరి జిల్లాలో రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు. ధాన్యం అమ్మే రైతుల నుండి వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. బస్తాకు 10కేజీలు అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 75 కేజీల బస్తాకు 10 కేజీలు అదనంగా ఎందుకు ఇవ్వాలో జగన్ సమాధానం చెప్పాలి..? జగన్ సాగు చేశావా..? దుక్కి దున్నవా..? ఎందుకివ్వాలి 10 కేజీల ధాన్యం అదనంగా..? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు అర్ధం లేని నిబంధనలు పెట్టి, విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసినవారు క్రాప్ హాలిడే ప్రకటించేలా చేశారు. దేశంలో రైతు ఆత్మహత్యలు చేసుకునే రాష్టాల్లో ఏపీ రెండవ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రైతుల పక్షపాతిగా ఉన్న చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం'' అని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చాక ఆ సంపదను పేదవాడికి పంచుతాం.. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. సంపదను సృష్టించి పేదవాడికి పంచుతామని ఆ పార్టీ నేత కూన రవికుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు. వైఎస్సార్సీపీ సర్కారు చేసిన అభివృద్ధి అంతా బూటకమని ఆగ్రహించారు. జగన్ పాలనలో రాష్ట్రం.. గంజాయి పండించడంలో దేశంలో మొదటి స్ధానంలో ఉందని ఎద్దేవా చేశారు.
ధరలు పెంచడం.. ప్రభుత్వానికి బాగా అలవాటైంది.. ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలతోపాటు, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై సీఎం జగన్ పెను భారాన్ని మోపారని.. టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు విమర్శించారు. జగన్ రెడ్డి వచ్చాక.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా పడిపోయి.. భూముల క్రయవిక్రయాలు బాగా మందగించాయన్నారు. ముందుచూపులేని నిర్ణయాలతో.. రాష్ట్రంలో ఎక్కడ భూముల క్రయవిక్రయాలు జరిగితే అక్కడ ధరలు పెంచడం.. ప్రభుత్వానికి అలవాటైందని మండిపడ్డారు.