School Teacher Cut Students Hair: కాకినాడ జిల్లాలోని ఓ పాఠశాలకు విద్యార్థినిలు జడ వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకుని వచ్చారన్న కోపంతో ఉపాధ్యాయురాలు వారి జుట్టును కత్తిరించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు.. ఆ ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. వివరాలివీ..
కాకినాడలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు జడలు వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకుని వచ్చారు. కేశాలంకరణపై గత కొన్ని రోజులుగా పాఠశాల ఉపాధ్యాయురాలు మంగాదేవి.. విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. అయినా, అది పట్టించుకోకుండా కొంతమంది విద్యార్థినులు బుధవారం జడ వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకుని పాఠశాలకు వచ్చి తరగతులకు హాజరయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా వారు అదే పనిగా జడ వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకుని వచ్చేసరికి కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు ఎనిమిది మంది విద్యార్థుల జుట్టు చివర్లో కొంతమేర కత్తిరించారు.
Haircut of Female Students Did Not Wear Braids: ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయాన్ని కాకినాడ అర్బన్ ఎంఈవో చెవ్వూరి రవి, డీవైఈవో రాజు వద్ద ప్రస్తావించగా ఘటనపై డీఈవోకు నివేదిక అందజేసినట్లు చెప్పారు. మరోవైపు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.
"స్కూల్కు జడ వేసుకోకుండా వచ్చారని మా పిల్లల జుట్టును.. ఉపాధ్యాయురాలు కత్తిరించారు. దీంతో మా పిల్లలు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారు. మా పిల్లల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము." - విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
Medical Student Died at Railway Station: కాకినాడ రైల్వేస్టేషన్లో వైద్య విద్యార్థిని దుర్మరణం
విద్యార్థులను కఠినంగా శిక్షించకూడదని, ఎన్ని ఆంక్షలు విధించినా.. కొందరు ఉపాధ్యాయులు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు విచక్షణారహింతంగా ప్రవర్తించి.. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆ స్టూడెంట్ ఊపిరాడని పరిస్థితుల్లో ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నరసాపురం పట్టణంలో టైలర్ పేట మున్సిపల్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. కాగా విద్యార్థినికి పరీక్షలో మార్కులు వచ్చాయన్న కోపంతో శ్రీరామలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్థినికి ఊపిరి అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. మార్కులు తక్కువగా వస్తే తమకు చెప్పాలని.. కానీ ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏమిటని వాపోయారు. ఉపాధ్యాయురాలుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కోరారు.