Oil From Animal Fat : కాకినాడ జిల్లాలో ఆవుల కొవ్వుతో నూనెను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నూనె తయారు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి.. నిల్వ ఉంచిన కొవ్వును, ఆవుల చర్మాన్ని, మాంసాన్ని, నాలుగు ఆవులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని పట్టణంలోని ఓ ఇంట్లో కొవ్వు నుంచి నూనె తీస్తున్నారనే అనుమానంతో ఎనిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ అధికారులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అప్పటికే వధించి నూనె తయారీకి సిద్ధంగా ఉన్న గోవు కళేబరాన్ని గుర్తించారు.
గోవులను అక్రమంగా వధించి చర్మం వేరు చేసి మాంసం విక్రయిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా చట్ట విరుద్ధంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గోవుల నుంచి తీసిన కొవ్వుతో నూనె మాత్రమే కాకుండా.. మరగబెట్టి డాల్డా కూడా తయారు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నాలుగు ఆవులను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కళేబరాన్ని ఖననం చేయనున్నట్లు తెలిపారు. డబ్బాలలో నిల్వ ఉంచిన కొవ్వును నాశనం చేస్తామని వెల్లడించారు. మున్సిపాలిటీ సిబ్బంది సహాయం తీసుకోనున్నట్లు తెలిపారు. నూనె తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
"వధించిన ఆవుల నుంచి తీసిన కొవ్వుతో నూనె తయారు చేస్తున్నారు. మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇదే కేంద్రంలో గోవుల చర్మం కూడా లభించింది. దీని గురించి ప్రభుత్వాధికారులకు తెలియజేస్తాము. వారు తగిన చర్యలు తీసుకుంటారు." -ఎనిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ అధికారులు
"వధించిన ఆవు మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక గోవు కళేబరం, మాంసం, ఎండబెట్టిన చర్మాన్ని గుర్తించాము. అలాగే గోవుల కొవ్వు స్వాధీనం చేసుకున్నాము. వీటిని మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ధ్వంసం చేస్తాము. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము. అలాగే ప్రక్కన నాలుగు బతికున్న ఆవులను సైతం గుర్తించాము. వాటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తాము." - తుని పోలీసులు
ఇవీ చదవండి: