Oil factory sample collection: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలోని అంబటి సుబ్బన్న నూనె కర్మాగారంలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన 5వ నెంబర్ ఆయిల్ ట్యాంకు నుంచి నమూనాలు సేకరించారు. నమూనాలను విశాఖలోని కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయానికి తరలించారు. పరిశ్రమలు, కార్మిక, కాలుష్య నియంత్రణ, ఆహార నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అధికారులు పరిశ్రమను పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరిపారు. పరిశ్రమను సీజ్ చేసిన అధికారులు.. పెద్దాపుపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
జేసీ ఆరా...
ప్రమాదం జరిగిన పరిశ్రమను కాకినాడ జిల్లా జేసీ ఇలక్కియ శుక్రవారం ఉదయం పరిశీలించి కారణాలు తెలుసు కున్నారు. ప్రమాదానికి కారణమైన అయిదో నంబరు నాన్- ఎడిబుల్ ఆయిల్ నిల్వ ట్యాంకుతోపాటు.. పక్కనున్న మిగిలిన నూనె నిల్వ ట్యాంకులను పరిశీలించారు. వాల్వులు.. భద్రత చర్యలను ఆయా శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోదాములో నిల్వ ఉంచిన నువ్వుల నూనె, పూజిత పేరుతో ఉన్న ఆయిల్ ప్యాకెట్లను జేసీ పరిశీలించారు.
త్వరలో స్పష్టత..
ఆక్సిజన్ అందక కార్మికులు చనిపోయారా..? లేదా నెలల తరబడి ఆయిల్ ట్యాంకు శుభ్రం చేయకపోవడంతో విషవాయువుల ఘాటుకు ప్రాణాలు వదిలారా..? అనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. నిబంధనలకు అనుగుణంగా ట్యాంకు పైన, దిగువన తెరిచే వెసులుబాటు ఉండాలి. గాలి వెళ్లేలా ఎయిర్ వాల్వ్‌లు ఏర్పాటుచేయాలి. ఈ ట్యాంకు డిజైనింగ్ నిబంధనలకు అనుగుణంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ఆపసోపాలు పడిన పరిశ్రమ యంత్రాంగం చివరికి గ్యాస్ కట్టర్లతో ట్యాంకుకు రంధ్రం పెట్టి వెలికి తీసింది. ట్యాంకుకు తూనికలు - కొలతల శాఖ అనుమతులు.. శుభ్రపరిచే ముందు గాలి నాణ్యత పరిశీలన వంటి అంశాలపైనా చర్చ నడుస్తోంది. ట్యాంకులోకి దిగడం హానికరం కాదని నిర్ధారణకు వచ్చినప్పుడే కార్మికులను లోనికి దింపాల్సి ఉన్నా.. ఖర్చు తగ్గించుకోడానికి నైపుణ్యం లేని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: