Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగిపోతోంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ నుంచి కాపులకు 5 శాతం కేటాయించనున్నట్లు కాపు సామాజికవర్గ నేతలతో జరిగిన సమావేశంలో నారా లోకేశ్ చెప్పారు.
బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కులాల మధ్య అగ్గిరాజేసి ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధిపొందుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. తునిలో కాపులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేశ్, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
3వేల కిమీ మైలు రాయిని అధిగమించిన యువగళం - పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్
టీడీపీ ప్రభుత్వం కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించిందని, విదేశీ విద్య ద్వారా యువతీ యువకుల అభ్యున్నతికి తోడ్పడిందని చెప్పారు. కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. కాపులకు ఏడాదికి 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్, కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని లోకేశ్ విమర్శించారు.
Yuvagalam Padayatra in Tuni Constituency: లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. దీనికి గుర్తుగా కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేశ్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి మైలురాయి వద్ద ఓ హామీ ఇస్తున్న లోకేశ్, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదల ఆకలి తీర్చేలా తేటగుంట పంచాయతీలో "అన్న క్యాంటీన్" ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జగన్ ప్రభుత్వపు అడ్డగోలు నిబంధనలు ఓ దివ్యాంగురాలి ప్రాణం తీశాయి: లోకేశ్
పైలాన్ ఆవిష్కరణ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి లోకేశ్ ముందుకు సాగారు. లోకేశ్ వెంట ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ యాత్రలో పాల్గొన్నారు. దేవాన్ష్ ఆరు కిలోమీటర్లు, బ్రాహ్మణి 9 కిలోమీటర్లు లోకేశ్‌తో కలిసి నడిచారు. అనంతరం పాదయాత్ర తుని గొల్లల అప్పారావు సెంటర్ వరకు సాగింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ, జనసేన శ్రేణులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు.
గత నెల 27న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద తిరిగి ప్రారంభమైన యువగళం పాదయాత్ర పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గం వరకు సాగింది. నేటితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యువగళం విజయవంతంగా ముగిసింది.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్