MP Raghurama Krishna Raju Returned : వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అనుకున్నది సాధించారు. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల తరువాత అడుగుపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలమైన భీమవరం వస్తున్నారు. దిల్లీ నుంచి ఎంపీ నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఎంపీ రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం వెళ్తారు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద రఘురామ కృష్ణంరాజు అభిమానులు, కుటుంబసభ్యులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. రఘురామ కృష్ణరాజుకు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరుపై, అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంతూరు రాకుండా అడ్డుకున్నారు : రఘురామ మీడియాతో మాట్లాడుతూ తనకు నిజమైన సంక్రాంతి పండగ వచ్చిందని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల తర్వాత సొంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని, మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరువలేనని తెలిపారు. అలాగే అభిమానులు, టీడీపీ , జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిదని అన్నారు. సొంత వారు ఎవరో, పరాయి వారు ఎవరో అర్థమవుతోందని, తన నానమ్మ చనిపోయినప్పుడు కూడా ఊరు రాలేక పోయానని, తనను ఊరికి రానీయ్యకుండా చాలా ప్రయత్నాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. చివరికి కోర్టు రక్షణతో వచ్చానని, పోలీసులు కూడా చాలా సహకరించారని ధన్యవాదాలు తెలిపారు.
సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించండి: ఎంపీ రఘురామకృష్ణరాజు
AP High Court on MP Raghu Rama Krishna Raju Petition : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంక్రాంతి పండగకు ఊరు వెళితే పోలీసులు అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పండుగకు ఊరు వెళ్లేందుకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా పిటీషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. పోలీసులు రఘురామపై 11 కేసులు నమోదు చేశారని తెలిపారు. గతంలో రఘురామను అరెస్టు చేసి హింసించారని పేర్కొన్నారు. మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నందున 41-ఏ నిబంధనలు పాటిస్తూ పిటిషనర్‌కు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ వాదించారు.
ఊరు వెళ్లేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు రక్షణ కల్పించండి: హైకోర్టు
రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు : రఘరామ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం వాదనలు విన్న న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 41-ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ రఘురామకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఊరట లభించిన రఘురామ నాలుగేళ్ల తరువాత సొంత ఊరిలో సంక్రాంత్రి సంబరాలు జరుపుకోవడానికి పయనమయ్యారు. ఆయన అభిమానులు భారీ ర్యాలీగా స్వాగతం పలికారు.