Idem Karma Mana Rastraniki Program: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సైకో ఫియర్‌తో బతుకుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ భయాన్ని వీడి తనతో కలిసి పోరాడాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం నూటికి వెయ్యి శాతం ఖాయమని పెద్దాపురం నియోజకవర్గం రోడ్‌షోలో తేల్చి చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. చెడు పనులు చేసే వాళ్లకి ఈ ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. రైతులపై దేశంలోనే తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీయే అంటూ ధ్వజమెత్తారు.
జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్రానికి పిక్ పాకెటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, కోడికత్తులు, గొడ్డలిపోట్లు వస్తాయి తప్పా.. పెట్టుబడులు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. జాతి నిర్వీర్యం అయితే భవిష్యత్తు ఉండదనే విషయం ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, పనులు గడప కూడా దాటట్లేదని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడని ధ్వజమెత్తారు.
ప్రతి 30కుటుంబాలకు ఇకపై పార్టీ తరుపున కుటుంబ సాధికార సారథులు ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారని చంద్రబాబు ప్రకటించారు. ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పనిచేస్తారని తెలిపారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారధులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారధులుగా మహిళలకు సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధి విభాగం ఉంటుందన్నారు. అన్ని కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ విభాగం తన పని చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
ఈనెల 21న విశాఖపట్నం, 22న ఏలూరు, 23 అమరావతి, 24 నెల్లూరు, 25 కడపలో శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఐదు పార్లమెంట్ స్థానాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఈ సమీక్షలు జరుపుతానన్నారు. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా సమీక్షలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు
కట్రావులపల్లిలో పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు మొక్కజొన్న, మిర్చి, వివిధ కూరగాయల పంటల రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జె.తిమ్మాపురం వద్ద మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్రేన్ ద్వారా భారీ గజమాలతో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోలో భాగంగా టీడీపీ శ్రేణులు చంద్రబాబు వెంబడి వేలాది బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు.
పెద్దాపురం నియోజకవర్గంలో తిమ్మాపురం, కట్టమూరు క్రాస్‌ల మీదుగా దర్గా సెంటర్లో చంద్రబాబు రోడ్ షో సాగింది. సాయంత్రం పెద్దాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో బహిరంగ సభ చేపట్టారు. రాత్రికి సామర్లకోటలోనే చంద్రబాబు బస చేయనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: