KAKINADA ARUDRA: ఆ తల్లిది అంతులేని ఆవేదన. కూతురు ఆరోగ్యం కోసం ఎన్ని పోరాటాలు చేసిన ఫలితం మాత్రం దక్కడం లేదు. దేవుడు వరమిచ్చిన.. పూజారి వరం ఇవ్వలేదన్న పరిస్థితి తలెత్తింది. అటు క్షీణిస్తున్న కుమార్తె ఆరోగ్యం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయి మరోసారి ముఖ్యమంత్రి జగన్కు మొర పెట్టుకుంటోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుకు వచ్చిందా..! కూతురు ఆరోగ్యం కోసం ఇల్లు అమ్ముకుందామంటే ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ.. తనకి న్యాయం చేయాలని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి సిద్దపడిన కాకినాడకు చెందిన ఆరుద్ర. ఇప్పటికైనా తన సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్కు మరోసారి విన్నవించుకుంది.
తన సమస్యలు పరిష్కరించడంలో కింది స్థాయి అధికారులు సహకరించడం లేదని కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేసింది. వెన్నెముక సమస్యతో అచేతనంగా మారిన తన కూతురు చికిత్స కోసం ఇళ్లు అమ్మకానికి పెడితే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని.. న్యాయం చేయాలంటూ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద 2022 నవంబర్ 02న ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు.
అప్పట్లో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆరుద్ర ఆవేదనపై స్పందించిన జగన్.. క్యాంపు కార్యాలయానికి పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్యను సత్వరమే పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోలేదని.. కొందరు అధికారులు తనను పట్టించుకోవడం లేదని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఆస్తి అమ్మేందుకు అడ్డంకులు తొలగలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తనను వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లు యథేచ్చగా తిరుగుతున్నారని వారిపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేసినందుకు తనను మాత్రం కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులు అమ్మేలా చర్యలు తీసుకోవాలని, తన కూతురు అచేతన స్థితిలో ఉన్న దృష్ట్యా తనకు కోర్టు కేసు నుంచి త్వరగా విముక్తి కల్పించాలని సీఎంకు ఆరుద్ర మరోసారి విన్నవించారు.
ఇవీ చదవండి: