AP Govt Has Mortgaged 338 Acres Lands in Kakinada: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడలో 337.83 ఎకరాల ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టింది. 2022 నవంబరు 4న ఏపీ మారిటైం బోర్డు సీఈఓకు, ఎస్‌బీఐ క్యాప్ అధికారులకు మధ్య కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ తనఖా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏపీఎస్‌డీసీని ఏర్పాటుచేసి 25వేల కోట్ల రుణం పుట్టించేందుకు విశాఖ భూములను, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టేసిన ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకుంది. కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలతో ఆ రుణం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పోర్టు భూములను తాకట్టు పెట్టి, ఏపీ మారిటైం బోర్డు పేరుతో రుణాలు తీసుకుంటున్నారు. కాకినాడలో ఇన్నాళ్లూ నిషేధిత జాబితాలో ఉన్న భూములను హడావుడిగా ఆ పరిధి నుంచి తొలగించి ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీకి తాకట్టు పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణ మండలాల పరిధిలోని 337.83 ఎకరాలు తాకట్టుపెట్టి 1,500 కోట్లు రుణం పొందడానికి ఏపీ మారిటైం బోర్డు గత నెల 4న తనఖా రిజిస్ట్రేషన్ చేసింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఎస్‌బీఐ ఓవర్సీస్ బ్రాంచిలో ఈ రుణం పొందారు. ఏపీ మారిటైం బోర్డు నవంబర్ 3న ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి లీజ్‌డీడ్‌కు అవకాశం ఇవ్వాలని అనుమతి కోరింది. జులై 4న బోర్డు సమావేశంలో తీర్మానం చేసిన విషయాన్ని తెలిపింది.
దీంతో 14343/2022 డాక్యుమెంటుతో కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. కాకినాడ నగర పరిధిలోని సర్వే నంబరు 2004/5లో 190.79 ఎకరాల పోర్టు భూములు 2015 జూలై 2 నుంచి 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ నిషేధాన్ని ఏపీ మారిటైం బోర్డు అభ్యర్థన, సర్కారు ఆదేశాలతో ఎత్తేసి భారీగా రుణం పొందే వీలు కల్పించారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి 700 కోట్లు, మచిలీపట్నం పోర్టుకు 550 కోట్లు, భావనపాడు పోర్టుకు 250 కోట్లు అవసరమైనందున ఈ రుణం తీసుకుంటున్నట్లు మార్చి 30న ఉత్తర్వులు జారీచేశారు. తీసుకున్న రుణాన్ని 2022-23 నుంచి 2035-36 వరకు వాయిదాల పద్ధతిలో చెల్లించేలా మారిటైంబోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడో మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల అభివృద్ధికి కాకినాడ పోర్టు భూములు తాకట్టు పెట్టడమేంటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
ఏపీ మారిటైం బోర్డు తనఖా పెట్టినవి నగరానికి చేరువగా ఉన్న విలువైన భూములు. అప్పు తీర్చడానికి 14ఏళ్ల ఒప్పందంతో వీటిని తనఖా పెట్టారు. ఇవన్నీ పోర్టు భూములేనని అధికారులు చెబుతున్నా.. వాటిలో కొన్ని ఇతర ప్రభుత్వ భూములూ ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరం, గ్రామీణ ప్రాంతాలలోని పలు సర్వే నంబర్లలో 67 చోట్ల మొత్తం 337.83 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటికీ ఇప్పుడు తనఖా రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. అయితే.. ఈ రిజిస్ట్రేషన్లు నిబంధనల మేరకే జరిగాయని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మి పట్నాయక్ చెబుతున్నారు. భూముల అంశాన్ని కలెక్టర్, జేసీ పరిశీలించి.. అవి పోర్టు భూములని నిర్ధారించాకే 337 ఎకరాల తనఖా రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు.
ఇవీ చదవండి: