YSRCP Minister Irregularities Krishna River Water: సీఎం జగన్ మంత్రివర్గంలో ఆయనో ‘పెద్ద ’ మంత్రి. మంత్రి వర్గంలోనే కాదు ప్రభుత్వంలోనూ కీలక నేతగా చలామణి అవుతున్నారు. ఆయన ఏం చెప్పినా ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆయన కనుసన్నలతో అధికారులను ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకూ నీరివ్వకుండా చేసి.. కృష్ణా జలాలను నేరుగా తన సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా హంద్రీనీవా కాలువ వెళ్తున్నా.. ఆ ప్రాంత ప్రజలు ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దాని నుంచి నేరుగా పుంగనూరు కాలువ వైపే ప్రవాహం కొనసాగుతోంది. జగన్ కేబినెట్‌లోని పెద్ద మంత్రి హుకుంతో మధ్యలో ఎక్కడా నీటిని వాడుకోకుండా అధికారులు నిఘా పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Agitation for Drinking Water in Gooty అనంతపురం గుత్తిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన..
శ్రీశైలం జలాశయం వెనుక భాగంలోని మాల్యాల పంపు హౌస్ నుంచి ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు 9.952 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2.316 టీఎంసీలు వినియోగించగా 7.636 టీఎంసీలు అనంత జిల్లా సరిహద్దుకు చేరాయి. ఈ జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు 3.785 టీఎంసీలు వాడినట్లు ‘లెక్క’ రాశారు. మిగతా 3.851 టీఎంసీలు హంద్రీనీవా కాలువకు తరలించినట్లు చెబుతున్నారు. 36వ ప్యాకేజీకి, గొల్లపల్లి జలాశయానికి మాత్రమే కొద్దిగా నీరందించారు. ఇప్పటికీ మారాల, మడకశిర ఉప కాలువ, చెర్లోపల్లి జలాశయానికి చుక్కనీరు ఇవ్వలేదు.
హంద్రీనీవా ప్రధాన కాలువ 400.500 కిలోమీటర్ల వద్ద మొదలయ్యే పుంగనూరు ఉప కాలువ పొడవు 232 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లాలో 75 కిలో మీటర్లు, మిగిలింది అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. అక్టోబరు 14 నుంచి మొదలుపెట్టి, అన్నమయ్య జిల్లా పుంగనూరు ఉప కాలువకు ఇప్పటికి 0.265 టీఎంసీలు సరఫరా చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో చెర్లోపల్లి జలాశయం ఉన్నా చుక్కనీటిని నిల్వ చేయడం లేదు. గతంలో ఇందులో ఉన్న నీటినీ కూడా పుంగనూరు ఉప కాలువకు పంపిస్తున్నారు. పెద్ద మంత్రి ఆదేశాల ప్రకారమే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల దాహార్తిని తీర్చే పీఏబీఆర్ జలాశయానికి సైతం నీరు విడుదల చేయలేదు. దీనిపై ఇక్కడి ప్రజాప్రతినిధులెవ్వరూ నోరు మెదపడం లేదు.