YSRCP Keeps Secret on Government Revenue Expenditure and Debt Calculations: సీఎం డ్యాష్ బోర్డ్. ఈ పదం విని దాదాపు నాలుగున్నరేళ్లు అవుతుంది కదా. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వశాఖల సమాచారాన్ని ఎప్పటికప్పుడు.. సీఎం డ్యాష్ బోర్డులో ఉంచేవారు. ఇప్పుడు సీఎం ఉన్నారు.. వారి నుంచి డ్యాష్ బోర్డు పదమే వినిపించడం లేదు. కానీ, జగన్‌కు గత ప్రభుత్వంలోనే పారదర్శకత కనిపించ లేదు.
2014 డిసెంబర్‌లో ప్రతిపక్ష నేత హోదాలో అప్పటి సీఎం చంద్రబాబుకు జగన్ ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు, కేంద్రం నుంచి తెస్తున్న రుణాలు, ఇతర వివరాలు.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆ లేఖలో జగన్ కోరారు. అకౌంటెంగ్ వ్యవస్థను కంప్యూటరీకరించినందున దానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని భావిస్తున్నానంటూ లేఖలో ముక్తాయించారు. ప్రతిపక్ష నేతగా పాలనలో పారదర్శకత కోసం అంతగా పరితపించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గప్‌చుప్ అంటున్నారు.
చివరికి కాగ్‌కూ చెప్పడం లేదు: జగన్ పాలనంతా రహస్యమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియవు. అందుకు తగ్గ ఏ సమాచారమూ ఏ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచరు. ఆఖరికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్-కాగ్‌కూ అనేక ఆర్థిక అంశాలు చెప్పడం లేదు. ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాల మొత్తం ఎంత అని.. ఏ నెలకు ఆ నెల తమకు వివరాలు ఇవ్వాలని కాగ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ప్రభుత్వం రుణాలు వివరాలు అందిచడం లేదు: ఏ నెలలో కూడా ఆ సమాచారం జగన్ సర్కార్ ఇవ్వడం లేదని కాగ్ ఆక్రోశిస్తూనే ఉంది. పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత మొత్తం రుణం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందో కూడా ప్రతి నెలా కాగ్ అడుగుతోంది. కానీ, ప్రభుత్వం ఆ లెక్కలూ వెల్లడించడం లేదు. ఫలితంగా రాష్ట్రం మొత్తం అప్పులు ఎంతనే విషయాలు తెలిసే ఆస్కారమే లేకుండా పోతోంది. అనేక రాష్ట్రాలు ప్రతి నెలా ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత మొత్తం రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తం తిరిగి చెల్లించారు తదితర వివరాలు కాగ్‌కు సమర్పిస్తున్నాయి. ఆ వివరాలన్నీ కాగ్ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. పోనీ అధికారులైనా చెప్తారా అంటూ దేనికి సమాధానం ఉండదు.
అనేక ఏళ్లపాటు ఆర్థిక మంత్రిగా పని చేసి.. ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడికీ.. రాష్ట్ర రుణాలు, రాబడులు తెలుసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో అసలు బిల్లుల బకాయిలు ఎంత ఉన్నాయో కూడా అధికారిక సమాచారం తెలియదు. ఒక ఆర్థిక సంవత్సరంలో పెండింగు బకాయిల మొత్తాన్ని తదుపరి ఏడాది బడ్జెట్‌కు బదలాయించడం లేదు.
ఆర్థికశాఖ కార్యాలయాలకు పోలీసుల భద్రత అవసరమైంది: మళ్లీ కొత్తగా విభాగాధిపతుల నుంచి ఫైలు నడపడం.. బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వడం వంటి ప్రక్రియ మొత్తం నిర్వహించాల్సి రావడంతో.. గత సంవత్సరాల్లో ఎంత మేర పెండింగు బిల్లులు ఉన్నాయో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికశాఖ అధికారులు తమ కార్యాలయానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అసలు పారదర్శకత అన్న పదమే బ్రహ్మపదార్థంగా మారింది.