YSRCP Govt Stopped Free Civil Services Training Scheme: సివిల్ సర్వీసెస్ దేశంలోనే అత్యున్నత ఉద్యోగం. అలాంటి కొలువు ఒక గిరిజన బిడ్డ సాధిస్తే.. దానికి ప్రభుత్వం చేయూతనిస్తే.. అది నిజమైన సాధికారత. సామాజిక సాధికారత అంటూ బస్సు యాత్రలు చేస్తున్న వైసీపీ సర్కార్ ఆ స్ఫూర్తికే తూట్లు పొడిచింది. గిరిపుత్రులకు గత ప్రభుత్వం అమలు చేసిన.. ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ పథకాన్ని జగన్ అధికారంలోకి రాగానే ఆపేశారు. నాలుగున్నరేళ్లు నిలిపివేసి మళ్లీ ఎన్నికల ముందు ఓట్ల ఎత్తుగడ వేస్తున్నారు.
సివిల్స్ సర్వీసెస్‌లో విజయం సాధించాలంటే కఠోర శ్రమతోపాటు ఖర్చుకూడా పెట్టాల్సి ఉంటుంది. గిరిజన విద్యార్థులకు ఆ కొలువు సాధించాలనే ఆలోచన ఉన్నా ఆర్థిక ఇబ్బందులు వారిని వెనక్కిలాగుతుంటాయి. అలాంటి వారిని ముందుకు నడిపించాలనే సత్సంకల్పంతో.. గత ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలు చేసింది.
ఎస్సీ, బీసీ విద్యార్థులతోపాటు గిరిజన బిడ్డలకూ.. ప్రఖ్యాత శిక్షణ సంస్థల్లో సివిల్స్ శిక్షణ ఇప్పించింది. దిల్లీ, బెంగళూరు, ముంబాయి, చైన్నై, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా.. వివిధ రాష్ట్రాల్లోని ప్రఖ్యాత శిక్షణా కేంద్రాల్లో గిరిజన విద్యార్థులు కోరుకున్న చోట ఉచిత శిక్షణ ఇప్పించింది. ఇలా ఒక్కరికీ ఇద్దరికీ కాదు. 910 మంది గిరిజన బిడ్డలకు ఉచితంగా కోచింగ్ అందించింది.
ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల వరకూ ఖర్చు చేసింది. కోచింగ్ సమయంలో దూర ప్రాంతంలో ఉంటూ ఇబ్బందిపడకూడదనే ఆలోచనతో వారికి నెల నెలా 10 వేల రూపాయల చొప్పున భృతి కూడా అందించింది. ఇలా పేద అభ్యర్థులకు చేయూతనిచ్చిన పథకాన్ని జగన్ అధికారంలోకి రాగానే పక్కనపెట్టేశారు.
Blind Man Farming : కళ్లు కనిపించకపోయినా వ్యవసాయం.. పంటకు కంచె ఏర్పాటు.. సేద్యం పనులు ఈజీగా..
"గిరిజన ప్రాంతాల నుంచి సివిల్ సర్వీసెస్ కోసం అభ్యర్థులు.. ఒక పూట తిని తినక కోచింగ్లు తీసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్ధలు అందిస్తున్న భోజనాన్ని తీసుకుని.. కోచింగ్లు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గిరిజన యువతకు నిరాశే మిగిల్చింది." -ఆనంద్, రాష్ట్ర కన్వీనర్, ఏబీవీపీ గిరిజన విభాగం
గత ప్రభుత్వ పథకాలపై పగబట్టిన వైసీపీ సర్కార్ కనీసం బకాయిలనూ చెల్లించలేదు. 2018-19 ఏడాదిలో వివిధ సంస్థల్లో కోచింగ్ తీసుకున్న 180 మంది అభ్యర్థులకు సంబంధించిన కోటి 39 లక్షల రూపాయల బకాయిలను.. నేటికీ ఆయా సంస్థలకు చెల్లించలేదు. బకాయిల కోసం 4శిక్షణా సంస్థలు కోర్టును ఆశ్రయించినా ఇప్పటికీ విడుదల చేయలేదు. దీన్నిబట్టి నా ఎస్టీ అంటూ జగన్ చెప్పే మాటల్లో చిత్తశుద్ధి ఎక్కడుందనే సందేహం వ్యక్తమవుతోంది.
"ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు లేవు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన భారీ అంబేడ్కర్ విగ్రహం చూశాను. నిధులు ఇచ్చి కోచింగ్ కోసం అభ్యర్థులను ప్రొత్సహిస్తే.. అంబేడ్కర్ లాంటి వారికి సంతోషం." -ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడవగా.. సివిల్స్ సర్వీసెస్ ఉచిత శిక్షణ పథకాన్ని ఆపేసిన జగన్.. ఇప్పుడు ఎన్నికలు ముందు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పేద విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవసరమైన శిక్షణకు ప్రోత్సాహకం ఇవ్వకుండా.. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో క్వాలిఫై అయితేనే వారికి ఆర్థిక సాయం అంటూ కొత్త పథకం తెచ్చారు. ఎన్నికలకు 5 నెలలు ముందు తెచ్చిన ఈ పథకంతో పదుల సంఖ్యలోనైనా లబ్దిపొందగలరా అనేది అనుమానమే.