YSRCP Government Stopped Fees Reimbursement for PG Students : రాష్ట్రంలో విద్యాదీవెన పథకాన్ని (Jagananna Vidya Deevena Scheme) ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రారంభించిన ప్రభుత్వం, దాని అమలులో మాత్రం తడబడుతోంది. 'నేతి బీరకాయ'లో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో 'విద్యా దీవెన'లో భాగంగా ఫీజుల చెల్లింపులపై సీఎం జగన్ (CM Jagan) చెప్పే మాటల్లోనూ అంతే నిజం ఉంటుంది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా పేద విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. కానీ, ఏ సమావేశంలోనైనా 'మీరు పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి వారిని చదివించే బాధ్యతను నేనే తీసుకుంటా'నంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్‌కు ఇవేమీ పట్టడం లేదు. పేద పిల్లల చదువు విషయంలో బటన్ నొక్కేందుకు చేతులెందుకు రావడం లేదో ఆయనకే తెలియాలి.
PG Students Not Eligible to Jagananna Vidya Deevena : ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సాధారణ డిగ్రీ వారికి డిసెంబరుతో మొదటి సెమిస్టర్ ముగుస్తుంది. బీటెక్, బీఫార్మసీ వాళ్లకు జనవరి 18తో మొదటి సెమిస్టర్ పూర్తవుతుంది. ఈ లెక్కన ఏడాదిలో ఇప్పటికే సగం చదువు పూర్తయినట్లు. ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధనా రుసుంలు విడుదల చేయలేదు. గత ఏడాది నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫీజులే ఇంకా ఇవ్వకపోవడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారు.
Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక
బటన్ నొక్కినా డబ్బులు జమ కావడానికి సమయం పడుతోంది : గతేడాది ఫీజులే బకాయి ఉండటంతో విద్యాసంస్థలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యా సంవత్సరం ఎక్కడ నష్టపోతామోననే భయంతో కొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్నారు. బోధన రుసుముల్లో ఎస్సీ, ఎస్టీలకు కేంద్రమే 60శాతం వరకు చెల్లిస్తోంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటున్న ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించకుండా విద్యాదీవెన కింద మొత్తం తామే చెల్లించినట్లు మాటలు చెబుతోంది. ఒకవేళ బోధన రుసుముల చెల్లింపులకు సంబంధించి జగన్ బటన్ నొక్కినా అవి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేందుకే 15-20 రోజులకుపైగా సమయం పడుతోంది.
విద్యార్థుల ఓట్లపై జగన్ కన్ను : ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజుల చెల్లింపులనూ జగన్ సర్కారు రాజకీయంగా వాడుకోవాలనుకుంది. దాంతో కళాశాలల ఖాతాల్లో జమ చేసే విధానానికి మార్పులు చేసి, మొదట తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించారు. ఇప్పుడు మరో మెట్టు దిగి విద్యార్థుల ఓట్ల కోసం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోనే పడుతున్నందున ఎప్పుడు పడినా మీరే తీసుకోవచ్చంటూ ఒకవేళ ఇప్పుడు వసూలు చేసుకోకపోతే డబ్బులు పడిన తర్వాత ఇస్తారో లేదోననే అనుమానంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.
ఫీజులను ఎగ్గొట్టిన ప్రభుత్వం : అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల మొత్తం 16 వందల 50కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన 600 కోట్లను చెల్లించబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కరోనా సమయంలో తరగతులు నిర్వహించనందున ఈ మొత్తం ఇవ్వడం లేదని పేర్కొంది. కానీ, కరోనా సమయంలో కళాశాలలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో బోధన చేశాయి. పరీక్షలూ నిర్వహించాయి. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకున్నాయి. ప్రభుత్వం మాత్రం అసలు తరగతులే జరగలేదని ఫీజులను ఎగ్గొట్టి పేద కుటుంబాలపై భారం మోపింది. 2022-23లో నాలుగో త్రైమాసికం ఫీజు బకాయిలు 600 కోట్లను ఎప్పుడు చెల్లిస్తుందో స్పష్టత లేదు. పీజీ కోర్సులకు సంబంధించి 450కోట్ల రూపాయల బకాయిలను నాలుగేళ్లుగా చెల్లించడం లేదు.
పేద పీజీ విద్యార్థులపై భారం : గత ప్రభుత్వం పీజీకి బోధన రుసుములను చెల్లించగా.. జగన్ ప్రభుత్వం మాత్రం ప్రైవేటులో చదివే వారికి నిలిపివేసింది. పీజీ స్థాయిలో ప్రైవేటులోనే అనేక కొత్త కోర్సులు ఉంటాయి. మార్కెట్‌కు కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలు నేర్పిస్తుంటాయి. దాంతో ఎక్కువ మంది అటువైపే మొగ్గు చూపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు మిగుల్చుకునేందుకు కొర్రీలు పెడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద పీజీ విద్యార్థులపై భారం మోపింది.
ఫీజులు చెల్లించండి, సర్టిఫికెట్లు తీసుకెళ్లండి : ప్రైవేటు కళాశాలల్లో పీజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 2020-21 నుంచి సర్కారు నిలిపివేసింది. అప్పటికే చదివిన వారికి సంబంధించిన బకాయిల మొత్తం 450 కోట్లుగా ఉంది. మొదట విజిలెన్స్ తనిఖీలంటూ సర్కారు కొంత కాలయాపన చేసింది. చివరికి ఆ బకాయిల కోసం యాజమాన్యాలు కోర్టుకు వెళ్తే, వారిని బుజ్జగించేందుకు వాటిని చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆ తర్వాత యాజమాన్యాలను బెదిరించి.. వన్‌టైం సెటిల్‌మెంట్ తీసుకొచ్చింది.
PG Student Reaction on Vidya Deevena Scheme : మొత్తం ఫీజులో 75శాతం ఇస్తామని, అది తమకు సరిపోతుందంటూ యాజమాన్యాలు లేఖలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ద్వారా ఒత్తిడి చేయించింది. అప్పటికే తీవ్రంగా నష్టపోయిన కళాశాలలు వచ్చిందే చాలనుకుని 75శాతం బకాయిలు ఇస్తే సరిపోతుందంటూ సమ్మతి లేఖలు ఇచ్చాయి. దాదాపు ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ వాటికి దిక్కు లేదు. ఫీజుల బకాయిల కారణంగా చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు తమ వద్దే ఉంచుకున్నాయి. అవసరమైన వారు మాత్రమే అప్పులు చేసి, ఫీజులను చెల్లించి తీసుకెళ్తున్నారు.