YSRCP Government Not Giving Pending Bills to Contractors : కాంట్రాక్టర్లు రోడ్డు వేస్తే నాలుగు నెలలకే తారు లేచిపోతుంది. భవనం కడితే ఏడాదికే బీటలు వారుతుంది. ఇది కాంట్రాక్టర్లపై చాలా మందిలో ఉండే అభిప్రాయం. ప్రభుత్వ పనులు చేసి బాగా కూడబెట్టుకుంటారనే అందరూ అనుకునేవారు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఆయనకేంట్రా కాంట్రాక్టర్ అన్నవాళ్లే ఇప్పుడు అయ్యో పాపం.. కాంట్రాక్టరా అని సానుభూతి చూపిస్తున్నారు.
Contractors Worst Condition Under CM Jagan Rule : నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం వాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్న తీరు చూసి జాలి పడుతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి, దొరికినకాడికి అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు... ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. చెప్పులతో కొట్టుకున్నారు. ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కొందరైతే బలవన్మరణాలకూ పాల్పడ్డారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు.
ప్రభుత్వ శాఖల్లో కోట్ల రూపాయల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం కాంట్రాక్టర్లు దాదాపు యుద్ధమే చేయాల్సి వస్తోంది. మా బిల్లులు చెల్లించండి.. ప్రాణాలు కాపాడండి. నాడు పోషకులం. నేడు యాచకులమంటూ ప్రకార్డులు పట్టుకుని కొన్ని నెలల క్రితం విజయవాడలోని ధర్నాచౌక్‌లో ఆవేదన పేరుతో కాంట్రాక్టర్లు నిర్వహించిన ఆందోళన వారి దుస్థితికి నిదర్శనం. విశాఖ, రాజమండ్రి, గుంటూరు ఇలా పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
Contractors Protest For Pending Bills : రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పనులు చేసిన గుత్తేదారులు పెండింగ్ బిల్లుల కోసం విజయవాడలోని R అండ్ B కార్యాలయం వద్ద ఆందోళనలకు దిగారు. కలెక్టర్లకు స్పందనలో వినతిపత్రాలూ ఇచ్చారు అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టే పథకాల కింద చేసిన పనులకూ బిల్లులు చెల్లించకపోవడంతో... కేంద్ర ఆర్థిక శాఖకు కాంట్రాక్టర్ల సంఘం ఫిర్యాదు చేసింది.
తీవ్ర ఆర్థిక భారాన్ని మోయలేక, అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక విపరీతమైన ఒత్తిడికి లోనై గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తి, 50 మందికి పైగా కాంట్రాక్టర్లు చనిపోయారని కాంట్రాక్టర్ల సంఘం చెబుతోంది. మరికొందరు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఉద్యానశాఖ నుంచి రావాల్సిన బిల్లులు ఇప్పించాలని లేకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వా లని గుంటూరుకు చెందిన కొల్లిపర హరికిషన్ జూన్ 5న స్పందనలో ఆర్జీ పెట్టడం ఈ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల దుస్థితికి నిదర్శనం.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలేనికి చెందిన గుత్తేదారు చిలకలూరిపేట, అద్దంకి, ఒంగోలు, చేజర్ల, పులిచింతల తదితర ప్రాంతాల్లో ఒక ప్రధాన కాంట్రాక్టర్ నుంచి సబ్ లీజుకు తీసుకుని అప్పులు తెచ్చి పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో సొంతూళ్లో పొలం, ఇళ్ల స్థలాలు విక్రయించి కొందరు బాకీలు తీర్చారు. మరో 30 నుంచి 40 లక్షల రూపాయల అప్పులు తీర్చలేక మనోవేదనతో మరణించారు.
ఏలూరు గ్రామీణ మండలం శనివారపుపేట పంచాయతీకి చెందిన గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు రాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ గుత్తేదారు జలవనరులు, పంచాయతీరాజ్, Rఅండ్ B శాఖల్లో 2019 నుంచి సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల విలువైన పనులు చేశారు. బిల్లులు రాక పోవడంతో అప్పులు తీర్చలేక సొంత మేనత్త ఇంట్లోనే 52 లక్షల 60 వేలు దొంగతనం చేయడం కాంట్రాక్టర్ల దారుణ పరిస్థితికి నిలువుటద్దం.
Pending Bills in AP: బిల్లుల కోసం హెలిప్యాడ్ గుత్తేదారుల ఎదురుచూపులు.. రూ.5 కోట్లకు పైగా బకాయిలు..
ఇప్పుడు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రావాలంటే మూడే మార్గాలున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారితో సిఫారసు చేయించుకోవాలి లేదా కోర్టుకెళ్లాలి. లేకపోతే దళారుల అవతారమెత్తిన ఒక మంత్రి, తాడేపల్లి కోటరీలోని ఇద్దరు ముగ్గురు సలహాదారులు, ముఖ్య నేతలకు 15 శాతం వరకు కమీషన్లు ముట్టజెప్పాలి. ఏ విభాగానికి చెందిన పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారో, అధికారులు దళారులకు ముందే లీక్ చేసి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు గుంజుతున్నారని సమాచారం. బిల్లుల కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నారు.
కోర్టు వారికి బిల్లులు చెల్లించాలని చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదు. కాంట్రాక్టర్లు మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కోర్టు సంబంధిత అధికారుల్ని పిలిపించి శిక్ష విధిస్తామని హెచ్చరిస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ కోర్టు ఖర్చులన్నీ కాంట్రాక్టర్లకు అదనపు భారం. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత శాఖల అధికారులు ఇలా పదే పదే కోర్టుకి వెళ్లాల్సి వచ్చినా ప్రభుత్వ వైఖరి మారలేదు. ప్రభుత్వం ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. బకాయిలు కట్టని చాలామంది కాంట్రాక్టర్ల ఖాతాల్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. వారికి భవిష్యత్తులో బ్యాంకుల్లో అప్పు పుట్టదు.
Contractors Situation in AP : గతంలో ఏ ప్రభుత్వమైనా పెండింగ్ బిల్లులన్నీ మార్చి నెలాఖరుకు క్లియర్ చేసేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు, నాలుగేళ్ల క్రితం చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదని పైగా అధికారుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సాగునీటి శాఖలో 3 కోట్ల రూపాయల పనులు చేసిన కాంట్రాక్టర్ ఆ మధ్య ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారిని కలసి గోడు వెళ్లబోసుకున్నారు.
ఒక్కో శాఖకూ బిల్లులు క్లియర్ చేస్తూ..... వెళుతున్నామని, మీ సమయం వచ్చాక మీకూ వస్తుందని, ఆలోగా ఒత్తిడి తెస్తే బిల్లు ఇవ్వబోమని ఆ అధికారి బెదిరించారని చెప్పారు. నేను బతికుండగా నా సమయం వస్తుందా అని ఆ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారని మరో కాంట్రాక్టర్ పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత దారుణమైన పరిస్థితి లేదని పని పూర్తయ్యాక మా గురించి ఆలోచించేవారే లేరని మరో కాంట్రాక్టర్ వాపోయారు. బ్యాంకులకు టర్నోవర్ చూపించకపోతే క్యాష్ క్రెడిట్ అకౌంట్‌ను మూసేస్తాయని అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా అప్పులు చేసి ఏదో ఒక పని చేస్తుంటామని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం పోయిందని అందుకే ఏ పనికీ ముందు కెళ్లట్లేదని వాపోయారు.
No Development Works: పన్నులపై ఉన్న శ్రద్ధ.. పనులపై ఉండదా! గుత్తేదారులు బెదిరిపోవడానికి ఎవరు కారణం?