YSRCP Government Frauds in the Name of Corporations: నిరుపేద, వెనకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాల్ని కల్పించే సదుద్దేశంతో ఏర్పాటైనవే కుల కార్పొరేషన్లు. ఇప్పటివరకూ ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చిన ఈ సంప్రదాయాన్ని వైఎస్సార్సీపీ సర్కారు మార్చేసింది. నాలుగున్నరేళ్లలో లక్ష్యానికి అనుగుణంగా ఒక్క రూపాయీ విడుదల చేయకుండా కార్పొరేషన్లను నిస్తేజంగా తయారుచేసింది. నవరత్న పథకాల నిధుల్నే కుల కార్పొరేషన్ల నిధులుగా చూపిస్తూ అంకెల గారడీ చేస్తోంది. మరి కార్పొరేషన్ల ద్వారా ఎవరికీ ఉపాధి అందడం లేదా అంటే ఎందుకు లేదు ముఖ్యమంత్రి జగన్ అనుచరవర్గానికి, భేషుగ్గా ఉపాధి లభించింది. ఎందుకంటే ఆయా కార్పొరేషన్లకి ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉన్నది ఆయన అస్మదీయులే మరి! తరతరాల వెనకబాటుని జయించి సొంత కాళ్లపై నిలబడేందుకు ఏ వర్గానికైనా స్వయం ఉపాధి రుణాలు కీలకం. ఆ బృహత్తర ఆశయంతో తీసుకువచ్చినవే కుల కార్పొరేషన్లు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అర్థం, పరమార్థాన్నే మార్చేశారు. అసలైన లక్ష్యాన్ని కాలదన్ని వాటిని తన అనుంగులకు, అస్మదీయులకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేశారు.
ఏటా బడ్జెట్‌లో కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించినట్టు చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాటినుంచి స్వయం ఉపాధికిగాను రాయితీ రుణంగా ఒక్క రూపాయి కూడా పొందేందుకు వీలుపడదు. ఎందుకంటే, నవరత్న పథకాల నిధుల్నే సామాజిక వర్గాల వారీగా విభజించి కార్పొరేషన్లలో చూపిస్తూ పేదల్ని నిలువునా వంచిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల నుంచి అగ్రవర్ణాల కార్పొరేషన్ల వరకు అన్నింటా అదే తీరు. గత 5 విడతల బడ్జెట్‌లోనూ ఇదే తంతు. ఎస్సీ కార్పొరేషన్ అయితే మరింత విచిత్రం. ఆ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి ఛైర్మన్లుగా వైఎస్సార్సీపీ నేతల్ని నియమించారేగానీ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయింపే లేదు. ఇంతకంటే వంచన మరొకటి ఉందా? ఉన్న పరిశ్రమల్ని బెదరగొట్టారు. కొన్నింటిని రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. ఐటీ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. చివరకు సొంత కాళ్లపై నిలబడేందుకు ఊతమిచ్చే కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. చివరికి జగన్ సాధించిందేంటో తెలుసా? పట్టభద్రుల నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తొలిస్థానంలో నిలపడం.
కుల కార్పొరేషన్ల నిధుల కేటాయింపులో జగన్ చేసే మాయ అంతా ఇంతా కాదు. ఏటా నవరత్న పథకాలకు ఉద్దేశించిన నిధుల్ని సామాజికవర్గాల వారీగా విభజించి ఆయా కార్పొరేషన్లలో ప్రత్యేకంగా చూపిస్తున్నారు. పథకాలకు బటన్ నొక్కే సమయంలో ఆయా సంక్షేమ శాఖల నుంచి నిధుల్ని కార్పొరేషన్ల ఖాతాల్లో బదిలీ చేసి అక్కడి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి తరలిస్తారు. అంతే తప్ప సొంతంగా ఒక్క రూపాయి వినియోగించుకోడానికి కార్పొరేషన్లకు వీలు లేదు. గత నాలుగున్నరేళ్లుగా ఇదే జరుగుతోంది. కార్పొరేషన్లు లేకపోయినా నవరత్న పథకాల అమలుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ వాటిని మనుగడలో ఉన్నట్టు చూపి పేదల్ని మోసం చేస్తూ రాజకీయ పందేరాన్ని నడుపుతున్నారు.
'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా 4 లక్షల 40 వేల మందికి 2 వేల 300 కోట్లు, ఎంబీసీలకు 84 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్షా 80 వేల మందికి 2 వేల 500 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా 14 వందల 41 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవన్నీ అప్పట్లో అమలైన సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా కేవలం స్వయం ఉపాధికిగాను రాయితీ రుణాలుగా ఇచ్చినవే. తద్వారా ఏటా వేల సంఖ్యలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన పేదలు లబ్ధిపొందారు. కానీ జగనేం చేశారో తెలుసా? అధికారం చేపట్టిన తొలి ఏడాది 2019-20లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లక్షా 94 వేల 582 మందికి 3 వేల 405 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్వయం ఉపాధి రుణాలకుగాను 20 లక్షల 67 వేల మంది 2019 డిసెంబరు నాటికే దరఖాస్తు చేసుకోగా వారికి ఒక్క రూపాయి మంజూరు చేయకుండానే రాయితీ రుణ పథకాల్నే ఎత్తేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక సామాజిక భద్రత పింఛన్లు, ఉపకారవేతనాలు, చేయూత, వాహనమిత్ర, చేదోడు, నేతన్ననేస్తం, ఆసరా వంటి పథకాలకు బడ్జెట్‌లో కేటాయించే నిధుల్నే కార్పొరేషన్లలోనూ చూపిస్తున్నారు. ఆయా పథకాల కిందే లబ్ధిపొందే వారిని సామాజిక వర్గాల వారీగా విభజించి వారికి వెచ్చించిన మొత్తాన్ని ఆ వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో మళ్లీ చూపిస్తారు. రేషన్ పంపిణీకి ఉద్దేశించిన వాహనాలకు మాత్రం రాయితీ కింద రుణాలు మంజూరు చేశారు.
How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్?..
బీసీలకు 56, ఎస్సీలకు 3, అగ్రవర్ణ పేదలకు 7, మైనారిటీలకు 6 ప్రత్యేక కార్పొరేషన్లు ఇలా చూస్తే లెక్క ఎక్కువగానే కనిపిస్తుంది. ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి జీవితాల్నే మార్చేస్తున్నట్టు జగన్ గొప్పలు చెప్పిన సందర్భాలెన్నో కానీ ఆయన మార్చింది పేదల జీవితాల్ని కాదు, తన అనుచరులవి. ఒక్కో కార్పొరేషన్ పరిధిలోనూ ఒక ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించుకునేలా ఉత్తర్వులిచ్చుకున్నారు. ఆ ప్రకారం బీసీ కార్పొరేషన్లనే తీసుకుంటే 56 సంస్థలకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా 728 మంది పార్టీ నాయకులకు పదవులు ఇచ్చారు. మిగతా కార్పొరేషన్ల పరిధిలోనూ మరో సుమారు 100 మంది నేతలకు పదవులు కట్టబెట్టారు. కానీ పైకి మాత్రం కార్పొరేషన్ల ఏర్పాటు పేదల ఉద్ధరణకే అంటూ చిలకపలుకులు పలుకుతారు. 56 బీసీ కార్పొరేషన్లను 2020 డిసెంబరులో ఏర్పాటు చేసిన ఆయన ఆయా పదవుల్లో ఆశీనులైన వారికి జీతభత్యాల కింద ఇప్పటివరకు దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేశారు. మిగతా కార్పొరేషన్లలోనూ దాదాపు అదే పరిస్థితి.
ఏటా జగన్ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రైస్తవ, బ్రాహ్మణ, కాపు, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా వేల కోట్లు కేటాయించినట్టు చూపిస్తారు. అదంతా అంకెల గారడీనే. 2019 నుంచి 2023 వరకు ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు వాటిని వేటికి ఖర్చు పెట్టారనేది చూస్తే జగన్ బండారం ఇట్టే బయటపడుతుంది. 2019-20 ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్ కింద 4 వేల 378 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. తీరా చూస్తే అవన్నీ నవరత్న, ఇతర పథకాలే. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల్ని మళ్లీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ, బ్రాహ్మణ, కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లుగా విభజించి వాటిలోనూ పొందుపరిచారు. అందరికీ ఇచ్చే పథకాలనే ఇందులో చూపిస్తున్నారు తప్ప కార్పొరేషన్ ఏర్పాటువల్ల ప్రత్యేకంగా రూపాయి కూడా ప్రయోజనం లేదు.