CM Jagan not Care on Polavaram Victims Promises: పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరినీ కాలనీలకు తరలిస్తామన్నారు. పీఎంతో మాట్లాడి ప్యాకేజీ ఇప్పించేస్తానన్నారు. కానీ ఆ మాటలు నిలబెట్టుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే తొలిదశలో ముంపు ప్రభావిత 24 వేల కుటుంబాలకు ఇంకా పునరావాసం కల్పించలేదు. ఆ కుటుంబాలన్నీ ముసురు పట్టిందంటే చాలు బిక్కుబిక్కుమంటున్నాయి. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఇచ్చిన హామీలను గోదాట్లో కలిపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన తమను నట్టేట్లో వదిలేస్తే ఎలా అని వాపోతున్నారు.
గోదావరిలో క్రమేణా ప్రవాహం పెరగడం నిర్వాసితుల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. సరిగ్గా ఏడాది కిందట ఇవే రోజుల్లో వరద ఊరూవాడను ఏకం చేసింది. అనూహ్యంగా వీధుల్లోకి నీరు పోటెత్తి ఇళ్లను ముంచెత్తింది. ఎప్పుడూ రాని గోదారి ఇంట్లో నిలువెత్తు స్థాయిలో నిలబడితే ఏం చేయాలో పాలుపోక ముంపు గ్రామాల ప్రజలు కకావికలమయ్యారు. చుట్టూ జలదిగ్బంధం. కాలకృత్యాలు తీర్చుకోవడానికీ కూడా వీల్లేక.. అడుగు కింద పెట్టలేక, బయటికి పోలేక, వండుకోలేక, తినలేక, ప్రభుత్వం నుంచి కనీసం ఆహారమూ, నీళ్లూ కూడా సరిగా అందక వందల గ్రామాల పోలవరం నిర్వాసితులు దుర్భరమైన జీవితం గడిపారు. ఎక్కడో ఎత్తయిన ప్రాంతాలు వెతుక్కొని వెళ్లి బతుకుజీవుడా అంటూ రోజులు వెళ్లదీశారు.
గోదావరికి అడ్డంగా పోలవరంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించిన తర్వాత వచ్చిన భారీ వరద వీరి వెన్నులో వణుకు పుట్టించింది. స్పిల్‌వే మీదుగా వచ్చిన వరదను వచ్చినట్లు వదిలేస్తున్నా.. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి ప్రవాహం వెనక్కి మళ్లి ఊళ్లను ముంచెత్తింది. గోదావరి వరద చరిత్ర లెక్కలన్నీ తిరగరాసిన ఈ వరద రోజుల్లో జగన్ సర్కార్ నిలువెత్తు నిర్లక్ష్యంతో పడిన కష్టాలు చూసి నిర్వాసితులు ఆ క్షణాల్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. వరదకు అందరూ తలో దిక్కయ్యారు. సామాన్లు లారీల్లో వాహనాల్లో పెట్టుకుని బస్టాండ్లలో, తెలిసిన వాళ్ల ఇళ్లలో రోజులు గడిపారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్.. పునరావాస ప్యాకేజీ ఇస్తామని చెప్పినా ఆ మాట చెప్పి ఏడాదైనా.. ఆ దిశగా ప్రయత్నం మాత్రం జరగడం లేదు.
పోలవరం ప్రాజెక్టు ముంపు బారినపడే కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రపురం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో ‘ఈటీవీ భారత్ - ఈనాడు’ బృందం ఇటీవల పర్యటించింది. ఎక్కడ ఎవరిని కదిపినా నాటి వరద రోజులనాటి భయానక క్షణాలను తలుచుకున్నారు. ఏ ఊళ్లో ఎంత ఎత్తున వరద నీరు చేరిందో చెబుతూ.. నాటి దృశ్యాలు, వీడియోలు సెల్‌ఫోన్లలో చూపించారు. ఇప్పటికీ తమకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదని.. కాలనీల్లోకి తమను తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వరద వస్తోందంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
"చాలా నష్టం జరిగింది. ఇళ్లు కూలిపోయాయి. పశువులు మరణించాయి. ఒక్కరోజులోనే దారులన్నీ మూసుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవటానికి బయటకు వెళ్లటానికి చాలా ఇబ్బంది అయ్యింది." -నిర్వాసితుడు
ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. పైనుంచి వరద ముంచుకొస్తోంది. మాకు రావాల్సిన ప్యాకేజి మాకు అందిస్తే.. మేము వెళ్లిపోతాము." -నిర్వాసితుడు
పోలవరం ప్రాజెక్టులో తొలి దశ పునరావాసం గతేడాది సెప్టెంబర్‌కే పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత నెలలో ఆయన సమీక్ష నిర్వహించేనాటికి కూడా నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జలవనరులశాఖ ప్రణాళిక ప్రకారం తొలిదశలోనే ఇంకా 8వేల 288 కుటుంబాలకు ప్యాకేజీ ఇచ్చి, పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. గోదావరి వరద వల్ల ఈ కుటుంబాలన్నీ ముంపు బారిన పడతాయని తెలిసీ, ఏడాది కాలంగా జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
2022 ఆగస్టు నుంచి ఇంతవరకు కేవలం 3వేల 731 కుటుంబాలను మాత్రమే తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 3వేల 228 మంది ఇళ్లు తామే నిర్మించుకుంటామని ప్రభుత్వానికి చెప్పారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం సాయం అందించాలి. 5 వేల 449 నిర్వాసిత కుటుంబాలకు 861 కోట్ల 80 లక్షలు వెచ్చించి ప్యాకేజీ, నిర్మాణ పనులు పూర్తి చేస్తే తక్షణమే తరలించవచ్చని ప్రణాళికలు రచించినా తరలింపు ప్రక్రియ సరిగా సాగడం లేదు. వీరు కాకుండా మరో 2 వేల 839 కుటుంబాలను ఆగస్టు నెలాఖరుకు తరలిస్తామంటూ జలవనరులశాఖ మరో ప్రణాళిక రూపొందించినా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమీ లేదు. వరద రోజులు వస్తున్నాయని, నిర్వాసిత గ్రామాల ప్రజలు అనేక మంది జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో తమకు నిర్దేశించిన కాలనీల నిర్మాణం ఎంత వరకు వచ్చిందో అని చూసి వస్తున్నారు. అక్కడ ఏడాది కాలంగా ఒక్క ఇటుక కూడా కొత్తగా వేసింది లేదు. ఎక్కడా పునరావాస కాలనీల నిర్మాణం సరిగా జరుగుతున్నదీ లేదు. దీంతో ఈ ఏడాదీ వరద కష్టాలు తప్పవన్న ఆందోళన నిర్వాసిత కుటుంబాల్లో కనిపిస్తోంది.
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెడితే ముంపులో చిక్కుకునే గ్రామాలనే తొలిదశలో చేర్చారు. అసలు నీళ్లు నిలబెట్టకముందే 170కు పైగా ఆవాసాలు అల్లకల్లోలమయ్యాయి. ముంపు ఊళ్లను ముంచెత్తింది. తొలిదశలో లేవని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతున్న గ్రామాలనూ ఇప్పుడు వరద ముంచెత్తుతోంది. కొన్ని ఊళ్ల చుట్టూ నీరు చేరి జలదిగ్బంధమవుతున్నాయి. మరికొన్ని ఊళ్లలోకి నీళ్లొస్తున్నాయి. ఎన్నాళ్లగానో నిర్వాసితులు గోల పెట్టడంతో మళ్లీ సర్వే చేశారు. అలా తొలిదశ వరద ప్రభావిత ఆవాసాలు మరో 48 ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. ఆ గ్రామాల్లో 16 వేల 642 కుటుంబాలు ఉన్నాయని లెక్కించారు. వారిని కూడా తొలిదశ కిందే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారి ప్యాకేజీ, తరలింపు, పునరావాసం కోసం 5వేల 127 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కించారు. ఈ కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు. కిందటేడాది వరదల అనుభవంతో ఈ కుటుంబాల గుండె జారిపోతోంది.